Pawan Kalyan: కూటమిలో విభేదాలపై పవన్ స్టేట్మెంట్..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వాన్ని దీర్ఘకాలం కొనసాగిస్తామని స్పష్టంగా చెబుతూ వచ్చిన పవన్, ఈసారి కొంచెం భిన్నంగా మాట్లాడడం చర్చకు దారితీసింది. కూటమిలో భవిష్యత్తులో విభేదాలు రావచ్చు అని, వాటికి మానసికంగా సిద్ధంగా ఉండాలని జనసేన (Jana Sena) నాయకులు, వీర మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ మాటలు ఎందుకు చెప్పారు? కూటమి భవిష్యత్తుపై సందేహాలా? లేక ముందస్తు హెచ్చరికలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు పొందిన నాయకులతో నిర్వహించిన సమావేశంలో పవన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పదవి అంటే కేవలం గౌరవం మాత్రమే కాదని, అది పెద్ద బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల మధ్య ఇబ్బందులు రావడం సహజమని చెప్పారు. అటువంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని, సమస్యలన్నీ తన భుజాలపై వేయకుండా నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన హెచ్చరికలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కూటమి అధికారంలోకి రావడంలో జనసేన కీలక పాత్ర పోషించిందనే భావన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. అందుకే పాలనలోనూ, పదవుల పంపకాలలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే ఆకాంక్ష జనసైనికుల్లో కనిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య సమన్వయం బాగానే ఉందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్నిచోట్ల టీడీపీ (TDP), జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే పవన్ ముందుగానే తన పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో అసంతృప్తులు రావచ్చు కానీ వాటిని పెద్దగా పెంచుకోకుండా, కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని ఆయన సందేశం ఇచ్చినట్లు భావిస్తున్నారు. కూటమి అంటే పై స్థాయి నాయకత్వమే కాదు, కిందిస్థాయిలోని కార్యకర్తల సమన్వయమే అసలైన బలం అనే విషయాన్ని గుర్తు చేయడమే పవన్ ఉద్దేశమని విశ్లేషకులు అంటున్నారు.
మొత్తానికి పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి బలహీనతను సూచించేవి కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు ముందస్తు జాగ్రత్తలుగా చూడాలని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. అయినా ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చలకు తావు ఇచ్చాయన్నది మాత్రం నిజం.






