Pawan Kalyan: రాజకీయ వ్యూహాల నుంచి పాలన వరకు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభావం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు (Pawan Kalyan) రాష్ట్ర రాజకీయాలకే కాదు, జాతీయస్థాయిలో కూడా తన ప్రత్యేకమైన ముద్రను స్పష్టంగా చూపిస్తున్నారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, పరిపాలనలోనూ ఫలితాలు చూపించగల నాయకుడిగా ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఆయన నిర్వహిస్తున్న పంచాయితీరాజ్ (Panchayathi Raj) , గ్రామీణాభివృద్ధి శాఖలు జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకోవడం ఆయన పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో జాతీయ ర్యాంకింగ్స్లో 23వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 22 స్థానాలు మెరుగుపరుచుకొని మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కీలకంగా ఉందని రాజకీయ, పరిపాలనా వర్గాలు చెబుతున్నాయి.
పరిపాలనలో ఫలితాలు సాధించడమే కాకుండా, రాజకీయ వ్యూహాలలోనూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిని చూపించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, మూడు పార్టీల కలయిక అవసరమని ముందుగానే స్పష్టంగా చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) పాలనకు ముగింపు పలకాలంటే ఐక్యతే మార్గమని ఆయన రాజకీయంగా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి (Nara Chandrababu Naidu) అరెస్టు సమయంలో బహిరంగంగా సంఘీభావం ప్రకటించి, రాజకీయంగా స్పష్టమైన వైఖరిని వెల్లడించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో, టీడీపీని ఎన్డీఏలో భాగం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా రాష్ట్రంలో కూటమి విజయం సాధించగా, జాతీయస్థాయిలో నరేంద్ర మోడీ గారి (Narendra Modi) మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంలో కూడా ఆంధ్రప్రదేశ్ పాత్ర ఉందనే అభిప్రాయం బలపడింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక శాఖలు దక్కాయి. గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలే తనకు కావాలన్న ఆయన కోరిక మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఈ శాఖలలో ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర నిధులను సమర్థంగా వినియోగిస్తూ, గ్రామాల అభివృద్ధికి స్పష్టమైన దిశను నిర్ణయించారు. “పల్లె పండుగ” వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం వంటి మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. గత రెండు సంవత్సరాలుగా జరిగిన ఈ అభివృద్ధి పనుల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచింది.
ఈ విజయం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పనితనం, నిర్ణయశక్తి, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. రాజకీయాల్లో మాటలకే పరిమితం కాకుండా, పనితో ఫలితాలు చూపిస్తున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రానికే కాదు, దేశానికీ గుర్తింపుగా మారుతున్నారు.






