Pawan Kalyan: ఏడాదిలోనే నియోజకవర్గానికి కొత్త రూపు తీసుకొచ్చిన పవన్..ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్..

2024 ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయలలో గుర్తింపు పొందిన ముఖ్యమైన నేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలు ఆయనను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వ్యాఖ్యలు చేసినా, ఈసారి ఆయన తన సత్తా చాటారు. తాను మాత్రమే కాదు, తన పార్టీ తరఫున మరో 20 మంది ఎమ్మెల్యేలను విజయవంతంగా అసెంబ్లీకి పంపారు. దీంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్ కళ్యాణ్, అక్కడ అభివృద్ధికి పాటుపడుతున్నారన్న నివేదికను జనసేన ఇటీవల విడుదల చేసింది.
ఈ నివేదికను “పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ రిపోర్ట్” (Pawan Kalyan progress Report) అనే పేరుతో పంచారు. ఏడాది కాలంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను ఇందులో వివరించారు. పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టడం, విద్యుత్, వైద్యం, రోడ్ల విభాగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. పల్లెలో పండుగ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల రహదారులు మెరుగయ్యాయని, రైతులకు మద్దతుగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు అందించామని వివరించారు. టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని కూడా చెప్పారు.
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (Pithapuram Area Development Authority) ఏర్పాటు చేసి దాని క్రింద రూ. 308 కోట్లకు పైగా నిధులు అభివృద్ధి కోసం వెచ్చించామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయడంలో పురోగతి సాధించామని చెప్పారు. గొల్లప్రోలు (Gollaprolu) మండలంలో రూ.5.52 కోట్ల పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులకీ తోడు, కార్పొరేట్ సంస్థల CSR నిధులు కూడా సమీకరించి అభివృద్ధికి ఉపయోగించారని వివరించారు.
ఉప్పాడ (Uppada) తీర ప్రాంతంలో నేల కోతల నివారణ కోసం జాతీయ నిపుణులను పిలిపించి అధ్యయనం చేయించారని, కొత్తపల్లిలో రూ.2 కోట్లతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. మహిళలకి టైలరింగ్ శిక్షణతో పాటు రూ.8.64 కోట్లతో ఉచితంగా కుట్టు మిషన్లు అందించారని, చిన్న రైతులకు రూ.26 లక్షలతో టార్పాలిన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.4.78 కోట్లు ఖర్చు పెట్టారని వివరించారు. మొగలి సూరీడు చెరువు సుందరీకరణకు రూ.4.06 కోట్లు వెచ్చించారని తెలిపారు.సంఖ్యాపరంగా మాత్రమే కాదు, అభివృద్ధి పరంగా కూడా పవన్ కళ్యాణ్ తన ప్రభావాన్ని చూపించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.