TDP: వైసీపీపై విమర్శకు నో మేటర్… కూటమి మంత్రులకు కంటెంట్ కష్టాలు!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ మంత్రులు ఒక ప్రత్యేక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని (Vijayawada) సచివాలయంలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా మారాయి. సచివాలయ పరిధిలో నిత్యం జరుగే మంత్రులు–మీడియా సంభాషణలు ఇప్పుడు కొంత ప్రత్యేకంగా మారాయి. కొన్ని రోజులుగా కొంతమంది మంత్రులు మీడియా ప్రతినిధులను పక్కకు పిలిచి, “ఎదైనా మంచి విషయాలు ఉన్నాయా? చెప్పండి, మా విమర్శలకు ఉపయోగపడతాయ్,” అని అడుగుతున్నారు.
ఈ వెనక ఉన్న అసలైన కారణం మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) తెస్తున్న ఒత్తిడి. ఆయన కేబినెట్‌కు చెందిన మంత్రులకు తరచూ హితబోధ చేస్తూ, “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై బలమైన రాజకీయ దాడులు చేయాలి,” అని చెప్తున్నారు. కానీ, చాలా మంత్రులు మాత్రం ఎప్పుడూ పాత విషయాలను రిపీటెడ్ గా ప్రస్తావిస్తున్నారు. జగన్ (Y.S. Jagan Mohan Reddy) ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో తల్లికి , చెల్లికి అన్యాయం, అక్రమాలు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందంటూ విమర్శలు చేస్తున్నారు. పైగా చాలా వరకు ఈ మ్యాటర్ మొత్తం ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ (Pawan) , లోకేష్ (Lokesh) ప్రస్తావించారు.. దీంతో కొత్తగా కంటెంట్ ఎవరికి దొరకడం లేదు.
అయితే ఈ మాటలు తిరిగి తిరిగి వినిపించడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది. ప్రభుత్వ అనుకూల మీడియా కూడా కొత్త విషయం లేకపోవడంతో పెద్దగా ఈ వ్యాఖ్యల్ని హైలైట్ చేయడం లేదు. దీంతో మంత్రులు నిరాశకు లోనవుతున్నారు. “ఇంకా కొత్తగా ఏం చెప్పాలి?” అనే దాని మీదే ఇప్పుడు వారి గందరగోళం ఎక్కువైంది.మరోపక్క జగన్ (Jagan) ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయి ఇప్పుడిప్పుడు యాక్టివ్ అవుతున్నారు. అటు మీడియా ముందు విమర్శలు చేస్తూ వైరల్ అయిన వైసీపీ నేతలు అందరూ ఇప్పుడు కేసులంటూ, కోర్టులంటూ తిరుగుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి వైసీపీ (YCP) గురించి మాట్లాడడానికి పెద్దగా మ్యాటర్ ఏమీ దొరకడం లేదు.
తాజాగా ఓ మహిళా మంత్రి మాట్లాడుతూ, “గత ప్రభుత్వం కేంద్రం నుంచి ఏదీ సాధించలేకపోయింది,” అని వ్యాఖ్యానించగా అది పెద్ద దుమారమే రేపింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “కేంద్రం విషయంలో విమర్శలు వద్దు. అప్పుడూ ఇప్పుడు అధికారంలో ఉన్నది మోడీ (Narendra Modi) ప్రభుత్వం కదా,” అని వారన్నారు. దీంతో మంత్రులు కేంద్రంపై విమర్శలు చేయడానికి కూడా వెనుకడుగేస్తున్నారు.
ఇప్పుడు మంత్రులకు కొత్త విషయాలు కావాలన్న తపన పెరిగిపోయింది. విజయవాడలోని సచివాలయ చాంబర్లలో మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు, పీఏలు గానీ, మంత్రులు గానీ… “ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా?” అని అడుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు చేయాలంటే అది ప్రజలలో ప్రభావం చూపించాలి. కానీ అదే పాత విషయాలు తిరగేస్తూ ఉంటే, ఆత్మవిమర్శ తప్ప మరేమీ మిగలదు. ఇదే ఇప్పుడు కూటమి మంత్రుల పరిస్థితి.