NDA Alliance: 2029 లక్ష్యంగా కొత్త నియోజకవర్గాలు ..మిత్ర పక్షాల డిమాండ్లతో రాజకీయ లెక్కలు మారేనా?
ఏపీలో రాబోయే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225 దాకా పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జనగణన పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో పాటు, అదే సమయంలో రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) సానుకూలంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే 2029 ఎన్నికలకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ (Andhra Pradesh)లో కనిష్టంగా 50, గరిష్టంగా 65 కొత్త నియోజకవర్గాలు పెరగవచ్చని రాజకీయ లెక్కలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రధాన పాత్ర పోషిస్తుండగా, జనసేన పార్టీ (Jana Sena Party), భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) మిత్ర పక్షాలుగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలో జనసేనకు 21, బీజేపీకి 10 సీట్లు కేటాయించారు. అప్పట్లో జనసేన కూడా కొంత త్యాగం చేసి తక్కువ సీట్లకే సరిపెట్టుకుంది. బీజేపీ కూడా మరిన్ని సీట్లు కోరినా, కూటమి ఐక్యత కోసం వెనక్కి తగ్గింది. అయితే 2029 నాటికి సీట్లు పెరిగితే మాత్రం ఈ రెండు పార్టీలు తమ వాటాను పెంచుకోవాలని చూస్తున్నాయని సమాచారం. జనసేన దాదాపు 40 సీట్లు, బీజేపీ 20 సీట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ అంచనాల నేపథ్యంలో జనసేన, బీజేపీ ఇప్పటి నుంచే పార్టీ విస్తరణపై దృష్టి పెట్టాయి. క్యాడర్ను బలోపేతం చేయాలని జనసేన నాయకత్వం సూచనలు ఇస్తోందని, బీజేపీ కూడా జిల్లాల వారీగా కార్యాచరణ పెంచుతోందని తెలుస్తోంది. గతంలో టికెట్లు దక్కని ఆశావహులు ఈసారి అవకాశాల కోసం సిద్ధమవుతున్నారని సమాచారం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో మిత్ర పక్షాల కోసం తమ స్థానాలను వదులుకున్న టీడీపీ నేతలు కూడా పెరగనున్న సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ కూటమిలో పెద్ద పార్టీ కావడంతో ప్రతి నియోజకవర్గంలో పలువురు ఆశావహులు ఉండటం సహజం. సీట్లు పెరిగినా కూడా అందరికీ న్యాయం చేయడం కష్టమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయినా, మిత్రులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత కూటమి పెద్దన్నగా టీడీపీపై ఉంటుందని అంటున్నారు.
భవిష్యత్తులో సీట్ల పంపకంపై పేచీలు తప్పవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకసారి అవకాశాలు కోల్పోయినవారు ఈసారి తగ్గే ప్రసక్తే లేదని భావిస్తున్నారు. జనసేన, బీజేపీ కలిసి ఎక్కువ సీట్లు కోరితే టీడీపీకి ఒత్తిడి పెరగవచ్చని విశ్లేషణ. అయినా, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు కూటమిని సమతుల్యంగా నడిపిస్తూ అందరినీ కలుపుకుపోతారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగే సీట్లే మరోసారి కూటమికి భారీ విజయానికి కారణమవుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.






