Nara Lokesh: విద్యార్థులే మన భవిష్యత్, ఆస్తి, సంపద! నారా లోకేష్
సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు
భవిష్యత్ లో ఏఐ ఇండిస్ట్రియల్ రివల్యూషన్ రాబోతోంది
ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది
స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీ కౌన్సిల్ కు మోహన్ రెడ్డి గారు ఛైర్మన్ గా ఉండాలని కోరుతున్నా
విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ను వర్చువల్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
అంతకుముందు విశాఖ చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ లో సైయెంట్ ఏఐ ల్యాబ్స్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి
విశాఖపట్నం: విద్యార్థులే మన భవిష్యత్, మన ఆస్తి, సంపద అని.. భవిష్యత్ లో వచ్చే ఏఐ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ను సద్వినియోగం చేసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పిలుపునిచ్చారు. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో రూ.8 కోట్లు వెచ్చించి విశాఖ జిల్లా వ్యాప్తంగా 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ల్యాబ్స్, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రోబో సాయంతో వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మిమ్మల్నందరినీ చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తుకువస్తున్నాయి. నేను కూడా మీలా రౌడీని. మీలో ఎవరెవరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, టీచర్, రాజకీయ నేతలు కావాలనుకుంటున్నారో చేతులు పైకి ఎత్తాలి. ఎంతమంది అంత్రపెన్యూర్స్ కావాలనుకుంటున్నారు? అంత్రపెన్యూర్ అంటే ఉద్యోగాలు కల్పించే వ్యక్తి. ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అయ్యామంటే దానికి కారణం బీవీ మోహన్ రెడ్డి గారు. గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. నా అల్లరి పనులన్నీ చూశారు. 1991లో సైయెంట్ అనే కంపెనీకి ఆనాడు ఇన్ఫోటెక్ అని పేరుండేది. బీవీ మోహన్ రెడ్డి గారిని అందరూ ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి గారు అని పిలిచేవారు. 1991లో ఇప్పుడున్న సైయెంట్ కంపెనీని స్థాపించి ఈ రోజు 16వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. కేవలం మన దేశంలోనే కాకుండా 22 దేశాల్లో సైయెంట్ కంపెనీని నడిపిస్తున్నారు. ఆయన కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి సుమారు రూ.8కోట్లు వెచ్చించి 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ను ఏర్పాటుచేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు.
విద్యార్థులే మన భవిష్యత్.. భవిష్యత్ లో ఏఐ ఇండిస్ట్రియల్ రివల్యూషన్ రాబోతోంది
ఏఐ వల్ల మనకేంటి ఉపయోగం అని అందరూ అనుకోవచ్చు. ఇక్కడున్న విద్యార్థులే మన భవిష్యత్. గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ వల్ల దేశం, ప్రపంచంలో తెలుగువారికి మెరుగైన అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఏఐ ఇండిస్ట్రియల్ రివల్యూషన్ రాబోతోంది. ఈ ఏఐ వల్ల మన రెగ్యులర్ పనులును టెక్నాలజీ సాయంతో చేయవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన కరిక్యులమ్ లో మార్పులు రావాలి. మన ల్యాబ్స్ లో మార్పులు రావాలని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి పరీక్ష విధానం వరకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇండస్ట్రీ రెవల్యూషన్ లో ప్రింటింగ్ ప్రెస్ కీలకపాత్ర పోషించింది. ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, విమానాలు, వ్యాక్సిన్లు రావడం వంటి అనేక పరిణామాల వల్ల మనం ముందుకు వెళ్లే పరిస్థితి. అలాంటి టెక్నాలజీ ఏఐ ఈ రోజు మనకు చూపిస్తుంది.
ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది
ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఏఐ టెక్నాలజీ వినియోగించి ఎలాంటి మార్పు తీసుకురావచ్చో మనం ఒక్కసారి ఆలోచించాలి. చంద్రంపాలెం స్కూల్ లో విద్యార్థులు ఏఐ వినియోగించి నీటిని మొక్కలకు ఏవిధంగా అందిచవచ్చో చూపించారు. సాంకేతిక పరిజ్ఞానం ఏవిధంగా మన జీవితాల్లో మార్పు తీసుకువస్తుందో వారు నాకు చెప్పడం జరిగింది. జీవితంలో అందరూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అందుకోసం అహర్నిశలు కష్టపడాలి. కేంద్రంలో ప్రధాని మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు కాబట్టే మనం ముందుకు వెళ్తున్నాం. దేశం సరైన దారిలో నడుస్తోంది. లక్ష్యాన్ని సాధించకపోతే బాధపడకూడదు. ఓటమి మనలో కసి పెంచాలి. అనుకున్నది సాధించేవరకు విడిచిపెట్టకూడదు.
కఠినమైన పనులు చేయాలంటే నాకు చాలా ఇష్టం
2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశాను. ఓడిపోయిన రోజు నాలా బాధ, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి నాలో కసి పెరిగింది. ఐదేళ్లు అక్కడే కష్టపడి 91వేల మెజార్టీతో ఆ సీటును నేను గెలుచుకున్నా. మనలో కసి చాలా అవసరం. విద్యాశాఖ వద్దని కూడా నాకు చాలామంది చెప్పారు. కఠినమైన పనులు చేయాలంటే నాకు చాలా ఇష్టం. విద్యాశాఖ తీసుకుని మార్పు తీసుకువస్తానని చెప్పా. నేను మంత్రి అయినప్పుడు విద్యాశాఖలో సరైన సమాచారం కూడా లేదు. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో, ఏ టీచర్ ఏ స్కూల్ లో పాఠాలు చెబుతున్నారో, ఎంతమంది పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. అక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించి ప్రభుత్వ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం.
ఉపాధ్యాయుల సహకారం వల్లే విద్యలో సంస్కరణలు తీసుకురాగలిగాం
ఉపాధ్యాయుల సహకారం వల్లే సంస్కరణలు తీసుకురాగలిగాం. ఇకపై కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్ పైనే మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మన పిల్లలే మన భవిష్యత్, మన ఆస్తి, సంపద. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ ను తగ్గించాలని ఇప్పటికే ఆదేశించాను. అసర్ నివేదిక గమనిస్తే.. దక్షిణ భారతదేశంలోనే లెర్నింగ్ అవుట్ కమ్స్ యావరేజ్ లో ఏపీ దిగువన ఉంది. మనం మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఉపాధ్యాయులపైన పవిత్రబాధ్యత ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్సీ నిర్వహించాం. సెప్టెంబర్ నాటికి వారందరూ విధుల్లోకి వస్తారు. మెగా పీటీఎం కూడా నిర్వహించాం. డిసెంబర్ లో రెండో పీటీఎం కూడా నిర్వహిస్తాం. పిల్లలకు ఇచ్చే పుస్తకాల్లో ఎక్కడా రాజకీయ నేతలు ఫోటోలు లేవు. పాఠశాల అనేది పవిత్రమైన ప్రాంగణం. పాఠశాలలు రాజకీయాలకు దూరంగా ఉండాలనేది మా లక్ష్యం.
మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం
విద్యా వ్యవస్థలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి.. కలవండి.. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. మెరుగైన విద్యావ్యవస్థను రూపొందించుకుందాం. పిల్లలందరూ బాగా చదవాలి. ప్రపంచమే మీది. వేరే స్టోరీలు అవసరం లేదు. మోహన్ రెడ్డి గారే అనేక మందికి స్ఫూర్తి. అనుకున్నది సాధించే సత్తా మనందరిలో ఉంది. భవిష్యత్ లో సైంటిస్ట్ గా, ఒక డాక్టర్, ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్, కొంతమందైనా రాజకీయ నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నా. మిగతావారు మోహన్ రెడ్డి గారిలా అంత్రపెన్యూర్స్ లా మారి దేశానికి మెరుగైన సేవ చేయాలి. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నా. సమాజంలో ఏ మార్పు అయితే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు సాధించేందుకు అహర్నిశలు కష్టపడేందుకు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను.
పాఠశాల విద్య బలోపేతం కోసం అడ్వైజరీ కౌన్సిల్ కు మోహన్ రెడ్డి గారు ఛైర్మన్ గా ఉండాలని కోరుతున్నా
తల్లిదండ్రులు గర్వపడే విధంగా విద్యార్థులు రాణించాలి. ఉపాధ్యాయులను మర్చిపోవద్దు. వారు క్రమశిక్షణ నేర్పించడం వల్లే నేను విద్యాశాఖ మంత్రిగా మీ ముందు ఉన్నా. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏవిధంగా బలోపేతం చేయాలి, లెర్నింగ్ అవుట్ కమ్స్ ను ఎలా తీసుకురావాలనేది గురువు గారు మోహన్ రెడ్డి గారితో నేను చర్చించాను. మీరు అనుమతిస్తే పాఠశాల విద్య బలోపేతం కోసం అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటుచేస్తే మోహన్ రెడ్డి గారు ఛైర్మన్ గా ఉండాలని కోరుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో అనేక పాఠశాలలను సైయెంట్ కంపెనీ ద్వారా దత్తత తీసుకుని మెరుగైన ఫలితాలు రాబట్టారు. 60శాతం టాపర్లు ఆ పాఠశాలల నుంచి వస్తున్నారు. మీ నాయకత్వంలో పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మనం ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులే కారణం. మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారు. దేశం మొత్తం మురళీ నాయక్ వెంట ఉంది. సైనికులు ఎక్కడ కనిపించినా వారికి సెల్యూట్ చేయాలి. జై హింద్..వందే మాతరం అంటూ నినదించారు. అనంతరం విద్యార్థుల మధ్య సెల్ఫీలు దిగారు.
రాబోయే రోజుల్లో ఏఐ వినియోగం పెరుగుతుంది
అంతకుముందు సైయెంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మన్, బోర్డు మెంబర్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఏఐ వినియోగం పెరుగుతుంది. విద్యార్థులకు ఇప్పటి నుంచే నేర్పిస్తే భవిష్యత్ లో బాగా రాణిస్తారు. అందుకే ఏఐ ల్యాబ్స్ ను పాఠశాలల్లో ఏర్పాటుచేస్తున్నాం. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మంత్రి నారా లోకేష్ తో సమయం పంచుకునే అవకాశం లభించింది. చంద్రబాబునాయుడు గారి కుటుంబంతో నాకు 25 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. లోకేష్ ఎంత చక్కగా పెరిగాడో అనే ఆనందం ఉందన్నారు.
అంతకుముందు విశాఖ చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ లో సైయెంట్ ఏఐ ల్యాబ్స్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి
అంతకుముందు విశాఖ చంద్రపాలెం జడ్పీ హైస్కూల్ లో సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన ఏఐ, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఏఐ, స్టెమ్, రోబోటిక్స్ టూల్స్ తో విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏఐ రోబోటిక్స్, స్టెమ్ రోబో, టింకర్ ఆర్బిట్స్, బేసిక్ బ్రెడ్ బోర్డ్ కిట్, ఏఐ ఎక్స్ ప్లోరర్ కిట్ లను పరిశీలించారు. వీటితో పాటు ప్రాజెక్ట్ కిట్, మెకాట్రాన్ కార్, స్మార్ట్ ఫార్మింగ్, రోబోటిక్ ఆర్మ్, డిజిటల్ డైస్ ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు అరుణశ్రీ, భాగ్యలక్ష్మిలు రూపొందించిన స్మార్ట్ ఫార్మింగ్ ప్రాజెక్టును పరిశీలించి సదరు విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సైయెంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మన్, బోర్డు మెంబర్ బీవీఆర్ మోహన్ రెడ్డితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, వేపాడ చిరంజీవిరావు, ఇతర ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.







