Nara Lokesh: ఏరోస్పేస్ పార్క్‌పై లోకేష్ ట్వీట్ కు పాటిల్ వైరల్ స్పందన..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారుల దృష్టి సారించడాన్ని చూస్తే, ఆర్థిక ప్రగతికి దోహదపడే మార్గంలో అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా పెట్టుబడులు రాబట్టేందుకు మంత్రుల చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఒక కీలక ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఏరోస్పేస్ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు. ఇది కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎం.బి. పాటిల్ (M.B. Patil) దృష్టికి వెళ్లింది. ఆయన కూడా దీనిపై స్పందిస్తూ దీర్ఘ వ్యాఖ్యలు చేశారు.
ఇదంతా కర్ణాటకలోని దేవనహళ్లి (Devanahalli) తాలుకాలో ప్రతిపాదించిన ఏరోస్పేస్ పార్క్ కోసం 1777 ఎకరాల భూమిని సేకరించాలన్న కర్నాటక ప్రభుత్వ పథకం నుంచి వెనక్కు తగ్గిన నేపథ్యంలో జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించిన ఈ నిర్ణయంతో అక్కడి రైతులకు ఊరట లభించింది. స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న రైతుల నుంచే భూములు తీసుకుంటామని, వారికి తగిన పారితోషికంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇస్తామని వెల్లడించారు.
ఈ పరిణామాల మధ్య లోకేష్ చేసిన ట్వీట్‌లో, “మీ భూముల విషయం తెలిసి బాధ కలిగింది… కానీ మేము మీ కోసం ఓ మంచి ప్లాన్‌తో ఉన్నాం. మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వైపు చూడకూడదు?” అని ప్రశ్నించారు. తమ వద్ద ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉందని తెలిపారు. అంతేకాదు, 8000 ఎకరాలకుపైగా భూమి సిద్ధంగా ఉందని, త్వరలో ఏరోస్పేస్ కంపెనీల ప్రతినిధులను కలిసే అవకాశముందని ట్వీట్ చేశారు.
దీనికి స్పందనగా పాటిల్ చేసిన పోస్ట్‌లో కేవలం భూమి మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాలుగా నిర్మించుకున్న ప్రౌఢమైన డిఫెన్స్, ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ కూడా తమ వద్ద ఉందన్నారు. భారత్‌లో తయారయ్యే ఏరోస్పేస్ ఉత్పత్తుల్లో 65 శాతం వాటా కర్ణాటకదేనని గుర్తు చేశారు. ఇది ప్రతిభ, ఆవిష్కరణల కలయికగా తీర్చిదిద్దిన పర్యావరణమని చెప్పారు. అంతేకాదు మొదటి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకున్న రాష్ట్రాలలో తమది ఒకటి కావడాన్ని గుర్తు చేస్తూ, కొత్త పరిశ్రమలూ తరచూ తమ రాష్ట్రాన్నే ఎంచుకుంటున్నాయని తెలిపారు. తమ వద్ద భూమి మాత్రమే కాదు, పారిశ్రామిక వృద్ధికి అవసరమైన అన్ని వనరులు, మద్దతు కూడా నిరంతరం ఉంటుందని స్పష్టం చేశారు. చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి పోస్ట్ ముగించారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సైలెంట్ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.