Nara Lokesh: తండ్రి అరెస్ట్ నాకు బలాన్నిచ్చింది..లోకేష్ భావోద్వేగ స్పందన..

నారా లోకేష్ (Nara Lokesh) ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయ వేదికలపై చురుకుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ మీడియా సంస్థలతో ఆయన చేస్తున్న సంభాషణలు విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవలే ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన రాజకీయ ప్రయాణం, కుటుంబ అనుభవాలు, ముఖ్యంగా తండ్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అరెస్టు సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రశ్నల సందర్బంగా రాజకీయాల్లో ఎదురైన ఒడిదుడుకులు, అనుభవాల గురించి మాట్లాడుతూ లోకేష్ తన దృఢత్వాన్ని స్పష్టంగా చూపించారు. ‘‘జీవితంలో పైకి ఎదిగినప్పుడు ఎంతో మంది మద్దతు ఇస్తారు. కానీ తక్కువ స్థాయిలలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మద్దతుగా ఉండాలంటే అన్ని సార్లు కుదరదు కదా.. నా జీవితంలో నేను కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాను. వాటన్నింటి ద్వారా నేను ఇంకా బలమైన నాయకుడిగా మారాను’’ అని ఆయన అన్నారు.
అయితే తన తండ్రి అరెస్టు అయిన సమయంలో తాను మానసికంగా ఎంతో బాధపడ్డానని, అది తనను తీవ్రంగా ప్రభావితం చేసిన సంఘటనగా గుర్తించారు. అప్పట్లో చంద్రబాబు గారిని రాజమండ్రి (Rajamandri) జైలులో ఉంచారు. ఇది తాను ఊహించలేని దృశ్యం అని అన్నారు. ప్రత్యేకంగా ఆ జైలును ఆధునీకరించేందుకు, అభివృద్ధి కోసం తానే ముందడుగు వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి జైలులోనే తన తండ్రిని బంధించడం చూసి మనసు కలిచిపోయిందని చెప్పారు.
ఆ దృశ్యాన్ని చూస్తే తన కన్నీళ్లు ఆగలేదని, కుటుంబ సభ్యుడిగా, కుమారుడిగా అది ఎంతో బాధాకరమైన అనుభూతిగా మిగిలిందని చెప్పారు. అయితే ఈ సంఘటన తనను బలంగా తీర్చిదిద్దిందని కూడా అన్నారు. తండ్రి అన్యాయంగా అరెస్టు అయినా, తమ కుటుంబం తలవంచకుండా ముందుకు సాగిందని స్పష్టం చేశారు.ఈ ఇంటర్వ్యూలో ఆయన చూపిన నిష్కళంకత, స్వచ్చమైన భావోద్వేగం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో ఒక నాయకుడి జీవితం ఎలాంటి ఒడిదుడుకులతో కూడినదో లోకేష్ మాట్లాడిన తీరు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది.