Nara Lokesh: అభివృద్ధికి పునాది వేసిన నేత.. చంద్రబాబు విజన్‌పై నారా లోకేష్ ప్రశంసలు..

నారా లోకేష్ (Nara Lokesh) ఇటీవల విశాఖపట్నం (Visakhapatnam) లో తన తండ్రి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎప్పుడూ ప్రశ్నలకు సమాధానమై నిలిచారని, ఆయన తీసుకున్న నిర్ణయాలు కాలక్రమంలో ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నాయో ఇప్పుడు అందరికీ స్పష్టమవుతోందని అన్నారు.
శుక్రవారం సాయంత్రం విశాఖలోని ఒక హోటల్‌లో జరిగిన సిఐ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్ఫరెన్స్(CII Aerospace Manufacturing Conference) లో పాల్గొన్న లోకేష్, తన ప్రసంగంలో గత నిర్ణయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయం కోసం ఒకప్పుడు భారీ ఎత్తున భూసేకరణ చేయడాన్ని చాలా మంది విమర్శించారని గుర్తు చేశారు. అప్పుడు “అంత భూమి ఎందుకు?” అన్నారు , కానీ నిజానికి చంద్రబాబు 2020 విజన్ దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఆ భూములు సేకరించారని అన్నారు. ఇప్పుడు ఆ ప్రయోజనాలను తెలంగాణ (Telangana) ప్రభుత్వం పొందుతోందని, అప్పట్లో విమర్శించినవారే నేడు అభినందిస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇదే విధంగా అమరావతి (Amaravati) ప్రాజెక్టు విషయానికొచ్చేసరికి, ప్రస్తుతం అనవసరమైన విమర్శలు, విషప్రచారం జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఇది అభివృద్ధి చెందాక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఒక ప్రత్యేక మణిహారంలా నిలుస్తుందని అన్నారు. అది రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని, ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ (IT) కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగంలో పెట్టుబడులు వస్తున్నాయని, మొత్తం మీద ఇప్పటివరకు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టగలిగామని చెప్పారు. త్వరలోనే విశాఖలో మరిన్ని ప్రాజెక్టులు స్థాపించబోతున్నారని, దీని ఫలితంగా 15 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని అన్నారు.
ఆర్థిక అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కూడా సమాంతరంగా నడుస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. సంపద సృష్టించి దానిని సమాజంలోని బలహీన వర్గాలకు పంచుతామనే వాగ్దానం ఇచ్చామని, దానిని అమలు చేసే దిశగా ఇప్పటికే చాలా పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. “సూపర్ 6” (Super six) పథకాల్లో ఎక్కువ భాగం ఇప్పటికే ప్రజలకు చేరాయని తెలిపారు.
అంతేకాక కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాఫల్యం సాధ్యమవుతోందని అన్నారు. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూసే నాయకులున్నారు కానీ, ప్రజల భాగస్వామ్యం ద్వారా ప్రతి నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు శైలి అని లోకేష్ చెప్పారు. అదే ఆయన పాలనకు పెద్ద నిదర్శనం అని అభిప్రాయపడ్డారు.