తిరుపతిలో మై స్కూల్ ఇటలీ ప్రీ స్కూల్ ప్రారంభం
ఇండో-ఇటాలియన్ సంస్థల సహకారంతో తిరుపతిలో మైస్కూల్ ఇటలీ ప్రిస్కూల్ ప్రారంభించారు. భవిష్యత్తులో ఒలింపిక్ విజేతలను తయారుచేయాలనే ఉన్నత లక్ష్యంతో ఈ ప్రీస్కూల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆదిమూలంతోపాటుగా అమెరికాకు చెందిన ఎన్నారైలు జయరాం కోమటి, సతీష్ వేమనతోపాటు మై స్కూల్ ఇటలీ ఫౌండర్ ప్రసాద్ గారపాటి, ఫౌండర్ అండ్ మేనెజింగ్ డైరెక్టర్ అపర్ణ వొల్లూరుతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ, ఈ ప్రీ స్కూల్ కాన్సెప్ట్ వినూత్నంగా ఉందన్నారు. ఇలాంటి స్కూల్స్ మరిన్ని ఏర్పాటు చేయాలని, అమెరికాలో ఇలాంటి స్కూల్ ప్రారంభించడానికి ఎంతో ఖర్చవుతుందని, కానీ మన దేశంలో స్కూల్ ఏర్పాటుకు ఖర్చు కూడా చాలా తక్కువని జయరాం పేర్కొన్నారు. ఇలాంటి స్కూల్ లో చేర్పించడం ద్వారా చిన్నారులకు సరైన విద్య, మానసిక స్థయిర్యం, సృజనాత్మకత లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇలాంటి స్కూల్ రాష్ట్రమంతా ప్రారంభమయ్యేలా శాసనసభ్యులు సహకారం అందించాలని కోరారు.







