Mudragada: మీ పని మీరు చూస్కోండి.. కుమార్తె క్రాంతికి ముద్రగడ కౌంటర్..!

వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) తన కుమార్తె క్రాంతి బార్లపూడి (Kranthi Barlapudi) చేసిన ఆరోపణలపై బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన తన ఆరోగ్యం, కుటుంబ వివాదాలు, కుమారుడు గిరిబాబుపై (Giri babu) వచ్చిన ఆరోపణలు, కుమార్తె కుటుంబంతో ఉన్న మనస్పర్థలను ఆయన లేఖలో ప్రస్తావించారు. అయితే ఆ లేఖలో ఎక్కడా తన కుమార్తె పేరు ప్రస్తావించలేదు. క్రాంతి ఇటీవల సోషల్ మీడియాలో తన తండ్రికి క్యాన్సర్ (Cancer) వ్యాధి ఉందని, సోదరుడు గిరి సరైన చికిత్స అందించకుండా ఆయనను బంధించారని ఆరోపించారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
క్రాంతి బార్లపూడి మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లో పెట్టారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, కానీ సోదరుడు గిరి ఆయనకు సరైన వైద్యం అందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని ఎవరూ కలవకుండా గిరి అడ్డుకుంటున్నాడని, తనను కూడా తండ్రిని చూడనివ్వడం లేదని ఆమె ఆరోపించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే కుమార్తె ఆరోపణలను ముద్రగడ ఖండిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వయసు రీత్యా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ తన చిన్న కొడుకు గిరిబాబు సంరక్షణ వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన కుటుంబంపై కుమార్తె కుటుంబం దాడి చేస్తోందని పరోక్షంగా విమర్శించారు. రెండు కుటుంబాల మధ్య చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్థలు ఉన్నాయని, గిరిబాబు ఎదుగుదలను అసూయతో చూడలేక ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే 100% నా చిన్న కొడుకు కారణం అని తేల్చి చెప్పారు. మా అబ్బాయిని దూరం చేస్తే వారి ఇంటికి చేరుతానని వారనుకుంటున్నారని… అది ఈ జన్మకు జరగదని స్పష్టం చేశారు. ముద్రగడ తనను బంధించి హింసిస్తున్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని, తన కుటుంబాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ముద్రగడ కుటుంబంలో ఈ వివాదం కొత్తది కాదు. గతంలోనూ ఆయన కుమార్తె క్రాంతి, కుమారుడు గిరిబాబుల మధ్య విభేదాలు బయటకు వచ్చాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ముద్రగడ ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లేకపోవడం గత కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాంశంగా ఉంది. క్రాంతి ఆరోపణలు ఈ విభేదాలను మరింత బహిర్గతం చేశాయి.
ముద్రగడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కీలక వ్యక్తి. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ఆయన చేసిన కృషి ఆ వర్గంలో ఆయనకు బలమైన ఆదరణ తెచ్చిపెట్టింది. అయితే, ఈ వివాదం ఆయన వ్యక్తిగత, రాజకీయ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముద్రగడ వైసీపీలో ఉండగా.. కుమార్తె క్రాంతి జనసేన పార్టీకి పని చేస్తున్నారు. దీంతో ఇరువరి మధ్య గ్యాప్ మరింత ముదిరింది. పైగా తాజా లేఖలోని ఆరోపణలు కుటుంబ వివాదానికి మించిన రాజకీయ కోణాన్ని సూచిస్తున్నాయి. కాపు రిజర్వేషన్‌లను అమలు చేయమని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలుగా భావించవచ్చు.