Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని కూటమి ప్రభుత్వం (Alliance Government) కృషి చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించేందుకు పెట్టుబడుల వేదికగా రాష్ట్రాన్ని నిలబెట్టాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చే సమావేశం తాజాగా జరిగింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ (Airbus) బోర్డు తో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ బస్ చైర్మన్ రెని ఓబెర్మన్ (Rene Obermann) తో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల కోసం అత్యంత అనువైన ప్రదేశమని వివరించిన లోకేష్, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) కూడా పాల్గొన్నారు.
సమావేశం అనంతరం నారా లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఈ భేటీ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఆయన ఎయిర్ బస్ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ పాలసీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల గురించి వివరించారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం అందించే మద్దతు, ప్రపంచ స్థాయి ఉత్పత్తి నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఆధునిక ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ (Aerospace Manufacturing Center) ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా టైర్-1, టైర్-2 సప్లై చైన్ యూనిట్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు చేశారు.
ఎయిర్ బస్ ప్రతినిధులు కూడా లోకేష్ సూచనలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయం తీసుకుంటే, వెంటనే సిద్ధమైన భూమిని కేటాయించి, ప్లగ్ అండ్ ప్లే విధానంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని లోకేష్ వివరించారు. ఆయన చెప్పిన విధంగా, రాష్ట్రంలో ఉన్న ఎయిర్‌పోర్టులు, లాజిస్టిక్ కారిడార్లు, కోర్టులు వంటి మౌలిక సదుపాయాలు ఏరోస్పేస్ పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని తెలియజేశారు.
రాష్ట్రాన్ని గ్లోబల్ మార్కెట్‌లో ఒక శక్తివంతమైన ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న లోకేష్, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు అవసరాన్ని కూడా ఎయిర్ బస్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ఏపీలో భారీగా పెట్టుబడులు రాబడటానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంతర ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయో అన్నది చూడాలి. మొత్తానికి, ఎయిర్ బస్ బోర్డు సమావేశం రాష్ట్రానికి కీలకమైన అవకాశాన్ని తెచ్చి పెట్టిందని, పెట్టుబడుల రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు.