Nara Lokesh: శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో మంత్రి లోకేష్ భేటీ
ఏపీలో యూఎస్ పెట్టుబడులకు సహకారం అందించండి
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) శ్రీకర్ రెడ్డితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి సాధిస్తోంది. ఏపీలో అమలుచేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అత్యుత్తమ ప్రోత్సాహకాల వల్ల గత 18నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా ఎంవోయూల తర్వాత నిర్ణీత సమయంలో పరిశ్రమలను గ్రౌండింగ్ చేసే సంస్థలకు ఎస్క్రో ఎకౌంట్ ద్వారా నేరుగా ప్రోత్సాహకాలను జమచేసే విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, షిప్‌బిల్డింగ్, పోర్ట్ కార్యకలాపాలు, పారిశ్రామిక పార్కులు, వాణిజ్య రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, రోబోటిక్స్, యంత్రాల తయారీ, హార్డ్‌వేర్, రైలు విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్యం, పరిశోధన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయి.
అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ప్రపంచస్థాయి సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతల్లో యువతకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. అమరావతిలో అతిత్వరలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖపట్నం డేటా హబ్ గా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు డయాస్పోరా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతోంది. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.






