Karedu: భూసేకరణపై వెనక్కు తగ్గని ప్రభుత్వం.. స్పెషల్ కలెక్టర్ నియామకం..!

నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు మండలం కరేడు (Karedu) గ్రామంతో పాటు సమీపంలోని 15 గ్రామాల్లో ఇండోసోల్ సోలార్ (indosol solar) ప్రాజెక్టు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, రామాయపట్నం పోర్టు (Ramayapatnam port) అభివృద్ధి కోసం ప్రభుత్వం 20,000 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 4,500–5,000 ఎకరాల భూమిని కరేడు ప్రాంతంలో సేకరించేందుకు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడంతో స్థానిక రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తాజాగా స్పెషల్ కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి, ఐదు బృందాలను నియమిస్తూ జీవో జారీ చేసింది. అయితే, స్థానిక రైతులు తమ జీవనాధారమైన సాగు భూములను కోల్పోతామనే ఆందోళనతో ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) రైతులకు మద్దతు ప్రకటించడం వివాదానికి మరింత ఊతమిచ్చింది.
కరేడు ప్రాంతం సారవంతమైన వ్యవసాయ భూములకు పెట్టింది పేరు. ఇక్కడ ఏడాదికి రెండు పంటలు పండుతాయి, 19 రకాల పంటలు సాగవుతాయి. 30 అడుగుల లోతులోనే నీరు లభిస్తుంది. ఇండోసోల్ సోలార్ కంపెనీ కోసం 4,912 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టు కోసం 5,148 ఎకరాలతో పాటు అదనంగా 3,200 ఎకరాలను ఇండోసోల్‌కు కేటాయించింది. అప్పట్లో రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇండోసోల్‌తో పాటు బీపీసీఎల్ రిఫైనరీ కోసం భూములను కరేడు ప్రాంతంలో సేకరించాలని నిర్ణయించింది. దీంతో స్థానికుల వ్యతిరేకత తీవ్రమైంది.
కరేడు గ్రామంలో జులై 4న నిర్వహించిన గ్రామసభ రైతుల ఆందోళనలతో రసాభాసగా మారింది. “చావనైనా చస్తాం, భూములు ఇవ్వం” అని రైతులు తేల్చి చెప్పారు. తమ జీవనాధారమైన భూములను కోల్పోవడం వల్ల వ్యవసాయం, ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కరేడు రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, కందుకూరు వైసీపీ ఇంఛార్జ్ బుర్రామధుసూదన్ యాదవ్ రైతులకు మద్దతుగా గ్రామసభలో పాల్గొన్నారు. గతంలో తమ ప్రభుత్వం రామాయపట్నం పోర్టు భూసేకరణను రైతులకు ఇబ్బంది లేకుండా నిర్వహించిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందని వైసీపీ ఆరోపించింది. ఇండోసోల్ ప్రాజెక్టు కోసం గ్రామాన్ని ఖాళీ చేయమనడం కూటమి ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని భావిస్తోంది. ఇండోసోల్, బీపీసీఎల్, రామాయపట్నం పోర్టు ప్రాజెక్టుల ద్వారా కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ అవకాశాన్ని కోల్పోవడం రాష్ట్రానికి నష్టమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, రైతులను ఒప్పించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. స్పెషల్ కలెక్టర్ నేతృత్వంలో ఐదు బృందాలు ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా భూములు సేకరించాలని ఆదేశించింది. ఒకవైపు ఆర్థికాభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించాలనే ప్రభుత్వ లక్ష్యం, మరోవైపు రైతుల జీవనాధారాన్ని కాపాడుకోవాలనే పోరాటం మధ్య ఈ వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. దీన్ని పరిష్కరించడానికి రైతులతో సంప్రదింపులు, పారదర్శకత, సముచిత పరిహారం కీలకం. లేకపోతే, ఈ ఉద్యమం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.