Sharmila: ఏపీ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. షర్మిల పదవి పై హై కమాండ్ చర్చలు..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో వైఎస్సార్‌టీపీని స్థాపించి, తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేసిన వైఎస్ షర్మిల (Y. S. Sharmila) ప్రస్తుతం ఏపీసీసీ (అప్క్) అధ్యక్షురాలిగా ఉన్నారు. 2024 జనవరిలో ఏపీపీసీ చీఫ్ గా ఆమె నియమితులయ్యారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పై విమర్శలు చేస్తూ పార్టీకి బలం చేకూర్చే ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు కానీ కూటమికి ప్లస్ అయింది.
చెల్లెమ్మ భావోద్వేగంతో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ ఓట్లను చీల్చడంతో అది టీడీపీ కూటమికి (TDP Alliance) లాభంగా మారింది. దీంతో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎన్నికల తరువాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం తిరిగి వెనకపడింది. ఇక ఇప్పుడు షర్మిల నేతృత్వాన్ని కొనసాగించాలా లేదా అనే దానిపై పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌లో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా, వారిని సమన్వయం చేయడంలో షర్మిల వెనుకబడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇండియా కూటమి పోరాటం చేస్తుంటే, ఏపీలో కాంగ్రెస్ సరైన దిశలో సాగడం లేదని నేతలు భావిస్తున్నారు. ఇది పార్టీకి మరింత నష్టాన్ని తెచ్చినట్టే. ముఖ్యంగా సీనియర్ నేతలు షర్మిల విధానాలపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ అధినేత పగ్గాలు మారే అవకాశాలపై ఊహాగానాలు ముమ్మరమయ్యాయి. ఆ స్థానానికి కిల్లి కృపారాణి (Killi Kruparani) పేరు చర్చలో ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు. 2009లో ఎంపీగా గెలిచిన ఆమెకు కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రిపదవి లభించింది. 2019కి ముందు వైసీపీలో చేరినా అక్కడ పెద్దగా అవకాశం రాక, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
2024లో టెక్కలి (Tekkali) అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)కు ఆమెపై నమ్మకం ఉండడం తో పాటు సామాజిక స్థాయి, రాజకీయ అనుభవం ఉన్న ఆమెను కొత్త పీసీసీ అధ్యక్షురాలిగా హైకమాండ్ ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అది నిజమైతే షర్మిల స్థానాన్ని కిల్లి కృపారాణి భర్తీ చేస్తారన్నది స్పష్టమవుతుంది. అయితే ఇది ఎంతవరకు జరిగే అవకాశం ఉందో త్వరలో తెలుస్తుంది. ఇదే జరిగితే మరి షర్మిల పరిస్థితి ఏంటి అన్న దానిపై కూడా చర్చలు సాగుతున్నాయి..