Jagan: 2025 లో జగన్ వీక్ గ్రాఫ్..మరి 2026 పరిస్థితి ఏమిటో?
మరి కొద్ది రోజుల్లో 2025 సంవత్సరం ముగియనుంది. క్యాలెండర్లో మరో పేజీ తిప్పడానికి సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ ఏడాది గమనంపై చర్చ మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే 2025 రాజకీయంగా ఎక్కువగా ఒకే దిశలో సాగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రాజకీయంగా బలంగా కనిపించగా, వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) మాత్రం పరిమితంగానే ప్రజల్లోకి వచ్చారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జగన్ ఈ ఏడాది ఎక్కువగా రైతుల సమస్యలపై దృష్టి పెట్టారు. పంట నష్టాలు, ధరల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను పరామర్శిస్తూ వారి పక్షాన నిలుస్తామని భరోసా ఇచ్చారు. అలాగే తమ పార్టీ నేతలు అరెస్టులు ఎదుర్కొన్న సందర్భాల్లో జైలులో ములాఖత్ ద్వారా కలుసుకుని, ఆ తర్వాత కొంతకాలం ప్రజల మధ్య కనిపించారు. అయితే ఆయన పర్యటనలు ఎక్కువగా గుంటూరు (Guntur), విజయవాడ (Vijayawada) పరిసర ప్రాంతాలకే పరిమితమయ్యాయని పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి.
2025 చివర్లో జగన్ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమంగా విజయవాడలోని జోజినగర్ (Jojinagar) ఘటన. అక్కడ 42 ప్లాట్లు కూల్చివేతకు గురైన బాధితులను ఆయన స్వయంగా పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని, అవసరమైతే న్యాయ సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు. చాలా కాలం తర్వాత ఆయన నేరుగా ప్రజల్లోకి వచ్చారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
ఇటీవల పులివెందుల (Pulivendula)లో రైతులను కలిసి వారి పొలాల్లోకి వెళ్లడం, మోత్వా తుఫాను సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం (Machilipatnam) పర్యటన కూడా ఈ ఏడాది జగన్ చేసిన ముఖ్యమైన కార్యక్రమాలుగా చెప్పవచ్చు. అలాగే విశాఖ జిల్లా నర్సీపట్నం (Narsipatnam)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించవద్దంటూ నిర్వహించిన కార్యక్రమం, మాకవరపాలెం (Makavarapalem)లో నిర్మించిన కళాశాల సందర్శన కూడా రాజకీయంగా ప్రాధాన్యం పొందాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం (Bangarupalem)లో మామిడి రైతుల సమస్యలు, నెల్లూరు జిల్లా (Nellore District) పర్యటన కూడా ఆయన 2025లో చేసిన కార్యక్రమాల్లో భాగమే.
ఈ ఏడాది మిగిలిన రోజుల్లో జగన్ మరిన్ని పెద్ద కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు తక్కువే. కానీ 2026లో మాత్రం ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉంటారని పార్టీ స్పష్టం చేస్తోంది. జనంతో మమేకమయ్యేలా విస్తృత కార్యాచరణకు వైసీపీ నాయకత్వం సిద్ధమవుతోందని సమాచారం. మొత్తం మీద 2025 చివర్లో జరిగిన విజయవాడ పర్యటన జగన్ రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కొత్త ఏడాదిలో వైసీపీ అడుగులు ఏ దిశగా పడతాయో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది.






