Pawan Kalyan: పవన్ పై సిఎం చంద్రబాబు ప్రసంశలు
ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లో నిర్వహించిన కలెక్టర్ ల కాన్ఫరెన్స్ (Collectors’ Conference) కు సిఎం చంద్రబాబు(Chandrababu naidu) హాజరు అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్ లు, శాఖల అధిపతులు, మంత్రులు హాజరు కాగా సిఎం ఆసక్తికర కామెంట్ చేసారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని స్పష్టం చేసారు. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని సూచించారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలన్నారు సిఎం. డేటా డ్రివెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం.. కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందని అభిప్రాయపడ్డారు. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందన్నారు. ఈ సందర్భంగా పవన్ పాలనా తీరుపై ఆసక్తికర కామెంట్ చేసారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారని, ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే.. తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారన్నారు.
డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా.. పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని అభినందించారు. మంత్రి లోకేష్(Nara Lokesh) గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారన్నారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ చేస్తున్న విమర్శలకు సిఎం కౌంటర్ ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నప్పటికీ.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని తెలిపారు. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయని పేర్కొన్నారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, అదో వైట్ ఎలిఫెంట్ గా మారిందన్నారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లమని తెలిపారు, కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందన్నారు. విమర్శలకు భయపడేది లేదని స్పష్టం చేసారు.






