YS Jagan: జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు..! సింగయ్య మృతి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల (Rentapalla) పర్యటనకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగి సింగయ్య (Singaiah accident) అనే కార్యకర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏపీలో రాజకీయ వివాదానికి దారితీసింది. జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్ ను ఏ2గా చేర్చారు. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ పర్సనల్ సెక్రటరీ కె.నాగేశ్వర రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. జస్టిస్ వై. లక్ష్మణ రావు నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ విచారణను నిర్వహించింది.
విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. “కారు ప్రమాదం జరిగితే, డ్రైవర్‌కు బాధ్యత ఉంటుంది కానీ కారులో ప్రయాణిస్తున్న వారికి ఏ సంబంధం?” అని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రమాదానికి ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారని పేర్కొంది. కుంభమేళా వంటి పెద్ద ఈవెంట్‌లలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతాయని, అలాంటి సందర్భాల్లో ప్రయాణికులను ఎలా నిందితులుగా చేయవచ్చని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు కేసు రాజకీయంగా ప్రేరేపితమైనదని జగన్ వాదనకు బలం చేకూర్చాయి.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. జగన్ పర్యటనకు మూడు కార్లు, 100 మంది కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. అయితే దాన్ని లెక్కచేయకుండా వందల కార్లు, వేల మంది కార్యకర్తలతో జగన్ వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని, జగన్ నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాక, ప్రమాదం జరిగిన సమయంలో బాధితుడు సింగయ్య కోసం అంబులెన్స్ కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, ఇది బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందని ప్రభుత్వం వాదించింది. పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా కలిసి ఈ కేసులో వాదనలు వినిపించనున్నట్లు తెలిపారు.
జగన్ తరఫు న్యాయవాదులు మాత్రం ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని వాదించారు. ప్రమాదం జరిగినప్పుడు మొదట ఒక టాటా సఫారీ కారు వల్ల ఇది జరిగిందని పోలీసులు చెప్పినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ కారు యజమాని, డ్రైవర్‌లను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారని, తర్వాత రాజకీయ ఒత్తిడితో జగన్ కారుగా మార్చి, తీవ్రమైన సెక్షన్లను జోడించారని వారు తెలిపారు. జగన్ ప్రయాణిస్తున్న వాహనం సుమారు 4,000 కిలోల బరువుండే బుల్లెట్‌ప్రూఫ్ కారు అని, బాధితుడి గాయాలు ఇంత భారీ వాహనం కింద నలిగినట్లు కనిపించలేదని వారు వాదించారు. అంతేకాక, జగన్‌కు జడ్+ కేటగిరీ భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఈ విషయంలో రెండు పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉన్నాయని జగన్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.