Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్

వైసీపీ (YCP) పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (Y.S. Jaganmohan Reddy) ఇటీవల రాజకీయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయనను చూడటానికి కూడా కష్టమే అయ్యేది. జిల్లాల పర్యటనలు పెద్దగా చేయకపోవడంతో, స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు గమనించకుండా పోయాయన్న అభిప్రాయం బలపడింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తరుణంలోనూ ప్రజల మధ్యకు వెళ్లడం, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరుగటం లేదు.
ఇటీవల ఎక్కువ సమయం బెంగళూరు (Bengaluru) లో గడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలహంక ప్యాలెస్ (Yelahanka Palace) లో ఆయన ఎక్కువగా నివాసం ఉంటున్నారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, జగన్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలంటే లేదా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాలంటే తప్పనిసరిగా ప్రజల మధ్య ఉండాలి. కానీ జగన్ మాత్రం తాడేపల్లి (Tadepalli) నుంచి ప్రెస్ మీటింగులు నిర్వహించడానికే పరిమితమవుతున్నారని చెబుతున్నారు.
ఆయన ప్రసంగాల్లో ఎక్కువ భాగం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) పై విమర్శలకే కేటాయిస్తున్నారు. కూటమి వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకోవడం కష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు కావలసింది విమర్శలు కాదు, వారి సమస్యలకు సమాధానాలు. విద్యుత్ సమస్యలు, ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాల లోపం, రోడ్ల పరిస్థితి వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నాయి. కానీ ఆ అంశాలపై జగన్ స్పష్టమైన చర్యా ప్రణాళికను ప్రకటించడం లేదని వాదిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే తరహా ధోరణి కనిపించిందని విమర్శలు వచ్చాయి. ఆయన చాలా వరకు పరిమిత వర్గాలకే చేరువయ్యారని, విశాలమైన ప్రజా పరిధిని సంపాదించుకోలేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ అదే పద్ధతి కొనసాగిస్తే, ప్రజల్లో ఆకర్షణ తగ్గిపోతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తోంది. ఈ పరిస్థితిలో జగన్ ఎప్పటికప్పుడు బెంగళూరు నుంచి వస్తూ వెళ్లడం, లేదా ప్రెస్ మీట్స్‌కు పరిమితం కావడం వల్ల కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకునే అవకాశం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిపై ఉద్యమం చేస్తేనే విశ్వసనీయత పెరుగుతుందని సూచిస్తున్నారు. గతంలో పరదాల రాజకీయం కారణంగా 11 సీట్లకు వైసీపీ పరిమితం అయింది.. ఇప్పుడు ప్రెస్ మీట్స్ తో సరిపెడుతూ సాగుతున్న జగన్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చర్చలు జరుగుతున్నాయి. ప్రజలతో అనుబంధం పెంచుకొని, వారి కష్టాలు నేరుగా విని పరిష్కార మార్గాలు చూపకపోతే, కూటమి ఎదుట పోరాటం చేయడం కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. ముందు రోజుల్లో ఎటువంటి ప్రణాళికలను అవలంబిస్తారు. చూడాల్సి ఉంది.