YS Viveka: వివేకా కేసు పరుగులు పెట్టడం ఖాయమా..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ అధికారులు దూకుడు పెంచే సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ తో ఇబ్బంది పడుతున్న వైసీపీ(YSRCP), వివేకానంద రెడ్డి హత్య కేసుతో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తాజాగా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటుగా ఇతర నిందితుల బెయిల్ రద్దు చేయాలని వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి, సిబిఐ కలిసి సుప్రీంకోర్టులో పిటీషన్ లు దాఖలు చేశారు.
గతంలో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి తో పాటుగా పలువురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐతో పాటు సునీత సుప్రీంకోర్టు గడప తొక్కారు. పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు కీలక అంశాలపై సిబిఐ అధికారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశించింది. సిబిఐ తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాతనే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తేల్చి చెప్పింది.
తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఇంకా ఇంకా తదుపరి దర్యాప్తు అవసరం అని సిబిఐ భావిస్తున్నదా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ పై కూడా సిబిఐ అభిప్రాయం ఏంటో తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం సిబిఐ కి సూచించింది. కేసు ట్రయిల్ తో పాటుగా తదుపరి దర్యాప్తును ఒకేసారి కొనసాగించే అవకాశం ఉందా అనే అంశాన్ని సిబిఐ తన అభిప్రాయంతో తెలియజేయాలని సూచించింది.
ఇప్పటికే లిక్కర్ స్కాం లో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి(Mithun Reddy)ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో సిబిఐ వేగంగా ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టులో జరిగిన బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఆసక్తిని రేపుతోంది. అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తే వైసిపి మానసికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేత మిధున్ రెడ్డిని అరెస్టు చేయడంతో మిగిలిన వారు పెద్ద లెక్క కాదు అనే అభిప్రాయాలు సైతం వైసీపీ వర్గాల్లో వినపడుతున్నాయి.