Sirimanotsavam: అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం

పూసపాటి రాజవంశీయుల ఆడపడుచు ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం (Sirimanotsavam) అంగరంగ వైభవంగా సాగింది. సాయంత్రం 4 గంటల సమయంలో పూజారి బంటుపల్లి వెంకటరావు (Bantupalli Venkata Rao) సిరిమాను అధిరోహించారు. ఆయన్ను అమ్మవారి ప్రతిరూపంగా భావించి భక్తులు రథంపై అరటిపండ్లు విసిరారు.పూజారి పైనుంచి అక్షింతలు చల్లారు. ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోవా గవర్నర్, ఆలయ ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) కుటుంబసమేతంగా తల్లిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయరెడ్డి (Anam Rama Narayana Reddy) పట్టువస్త్రాలు సమర్పించారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఘటం సమర్పించి మొక్కు చెల్లించారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూజాల్లో పాల్గొన్నారు.