Google: వైజాగ్‌లో ఎఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రక ఘట్టం నమోదైంది. ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) , భారతదేశంలోనే అత్యంత భారీ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టనుంది. విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, వైజాగ్ ‘ఏఐ సిటీ’ గా రూపుదిద్దుకునే దిశగా ఇది కీలక అడుగుగా నిలవనుంది.
న్యూఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సహా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ ‘‘అమెరికా వెలుపల గూగుల్ చేస్తున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా భారత్‌లో టెక్నాలజీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాం. జెమినీ-ఏఐతోపాటు గూగుల్ క్లౌడ్ అందించే ప్రపంచ స్థాయి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు వెలువడే అవకాశం ఉంది,’’ అని పేర్కొన్నారు. ఇది విశాఖ నుంచి గ్లోబల్ కనెక్టివిటీని మరింత పెంచుతుందని తెలిపారు. ‘భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారంతో విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హబ్‌ను ప్రారంభిస్తున్నాం. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుతాం’’ అని తెలిపారు.
ఈ హబ్ ద్వారా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నట్లు వివరించారు. ఈ కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను (టీపీయూ) వాడతామని, ఇవి ఏఐ ప్రాసెసింగ్‌కు రెట్టింపు వేగాన్ని అందిస్తాయని కురియన్ పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్ వంటి ఎన్నో సేవలను ఇకపై భారత్ నుంచే ప్రపంచానికి అందించే అవకాశం కలుగుతుందన్నారు. ‘‘ఈ హబ్ ద్వారా కేవలం టెక్నాలజీని అందించడమే కాకుండా, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో ఇది మా భాగస్వామ్యం’’ అని ఆయన అన్నారు.
రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడి, భారీ ఉద్యోగాలు
గూగుల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా 15 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియా ఖండంలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ డేటా సెంటర్ 2028-32 మధ్య పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఏటా రూ.10,518 కోట్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తికి తోడ్పాటు లభిస్తుంది. సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు (నేరుగా, పరోక్షంగా) సృష్టికావచ్చని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత సేవల ద్వారా ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం, భారతదేశ టెక్నాలజీ కేంద్రంగా మారేందుకు బలమైన పునాది పడిరది. అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడిని ఆకర్షించడంతో, ఏపీ ఇకపై ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల దృష్టిని మరింతగా ఆకర్షించనుంది. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌గా రూపొందనుంది. పెట్టుబడి అంచనాలలో 6 బిలియన్లు నుండి 15 బిలియన్లు వరకు వివిధ నివేదికలు ఉన్నాయి. 15 బిలియన్లు అనేది ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం సహా 5 సంవత్సరాల మల్టీ-ఫేజ్ ఇన్వెస్ట్మెంట్గా తెలుస్తోంది.
సాంకేతిక – మౌలిక సదుపాయాలు
ఈ క్లస్టర్‌కు ఉమ్మడిగా సుమారు 2100 మెగావాట విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా. గూగుల్ ఈ డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు 20,000 కోట్లు ఖర్చు చేయనుంది. సముద్రపు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే చిన్న హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా అవకాశం ఉంది. డేటా సెంటర్ కూలింగ్ కోసం భారీగా నీరు అవసరం. సాగరతీరం కావడం వలన, కూలింగ్‌కు విశాఖ అనుకూలమైన ప్రదేశంగా గూగుల్ ఎంపిక చేసుకుంది. అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను పెంచేందుకు 3 సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి డేటా సెంటర్‌ను అనుసంధానించనుంది. ముంబైలోని పియరింగ్, క్యాచీ సర్వర్ల నుంచి డార్క్ ఫైబర్ ద్వారా కేబుల్ తీసుకోవడం సులువు అవుతుంది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, జెమినీ-ఏఐ వంటి అత్యంత డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (%AI%) వర్క్‌లోడ్‌లను నిర్వహించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది.
ప్రాజెక్ట్ కాలక్రమం
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ సమర్పించిన ప్రతిపాదన ప్రకారం అంచనా వేసిన పనుల కాలక్రమం మార్చి 2026 నాటికి అనుమతులు లభిస్తే మొదటి దశ పూర్తి చేయడానికి నిర్మాణ ప్రారంభం అయిన 2.5 సంవత్సరాలలో చేస్తారు.. జూలై 2028 నాటికి లేదా 2028-2032 మధ్య పూర్తిస్థాయిలో కార్యకలాపాల ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు పురోగతిని, ముఖ్యంగా భూసేకరణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గమ్యస్థానంగా ఏపీ: డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ముందంజ
ఎఐ హబ్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ముందంజలో నిలిచింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం %AI% హబ్ ఏర్పాటు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బలమైన పునాది పడింది.
సుందర్ పిచాయ్ స్పందన
టెక్నాలజీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా విశాఖపట్నానికి భారీ గుర్తింపు లభించనుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, తమ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో స్పందించారు. భారతదేశంలో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కీలక ముందడుగు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్, ‘‘విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ తొలి ఏఐ హబ్ ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ జరిగింది ఒక చారిత్రాత్మక పరిణామం’’ అని పేర్కొన్నారు. ఈ హబ్ కేవలం ఒక కార్యాలయంగా కాకుండా, అత్యంత శక్తివంతమైన సాంకేతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని వివరించారు. ఈ ఏఐ హబ్ ద్వారా గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలను ఒకేచోట అనుసంధానించనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా గూగుల్ తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలకు, వినియోగదారులకు మరింత చేరువ చేస్తుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు, ఆర్థిక వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖ నగరం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో కీలక స్థానాన్ని సంపాదించుకోనుంది.
ఏఐ సిటీగా విశాఖ
గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వల్ల ఎఐ సిటీగా విశాఖపట్టణం మారనున్నది. విశాఖలో ఏర్పాటుచేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను అమలు చేసి, భారతదేశంలో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయనుంది. ఈ కొత్త ఏఐ హబ్‌లో అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ను ఒకేచోట సమన్వయపరచి, విశాఖపట్నాన్ని భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది.