War of Revival: వార్ ఆఫ్ రివైవల్.. గాజా యుద్ధం పేరుమార్పుకు ఇజ్రాయెల్ క్యాబినెట్ అంగీకారం

గాజా (Gaza) యుద్ధం మళ్లీ మొదటికి వచ్చింది. ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు బూడిదలో పన్నీరులో పోసినట్లుగా మారింది. మీరు మొదట కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటే కాదు.. మీరేనంటూ హమాస్ (Hamas), ఇజ్రాయెల్ (Israel) పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. వాస్తవానికి తమ దళాలపై హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారంటూ శనివారం అంతా.. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేసింది. అంతేకాదు..మళ్లీ గాజా స్ట్రిప్ లోకి వచ్చేవారిని అడ్డుకుంటోంది కూడా.
గాజావాసులపై దాడులు చేయడం ద్వారా కాల్పుల విరమణ ఉల్లంఘన చేయడానికి హమాస్ ప్రయత్నిస్తోందంటూ .. ఇప్పటికే వైట్ హౌస్ ప్రతినిధులు ఆరోపించారు. దీంతో ఈపరిణామం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని ఆందోళన చెందిన హమాస్ ప్రతినిధులు.. ఈజిప్టు రాజధాని కైరోలో మధ్యవర్తులు ఈజిప్టు, ఖతార్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. అసలు అక్కడేమి జరిగింది అన్న అంశంపై వివరణ ఇవ్వడంతో పాటు.. కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు సాగడానికి చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎప్పుడైతే మళ్లీ యుద్ధం మొదలైందో.. ఇజ్రాయెల్ సర్కార్ అప్రమత్తమైంది. హమాస్ నిరాయుధులుగా మారే వరకూ యుద్ధం విరమించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు..ప్రస్తుతం నెతన్యాహు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు కూడా. దీనిలో భాగంగా గాజా వార్ యుద్ధానికి ఉన్న పేరును సైతం ఇజ్రాయెల్ ఆర్మీ మార్చింది. వార్ ఆఫ్ రివైవల్ గా నామకరణం చేసింది. దీనికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది కూడా.
ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తకిరంగా మారింది. ఎందుకంటే.. తమ మాట వినకుండా దాడులు చేస్తే.. గాజాలోకి వెళ్లి మరీ హమాస్ నేతలను హత్య చేస్తామని ఇప్పటికే ట్రంప్ కటువుగా చెప్పారు. ఇప్పుడు ఆయన మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రోత్సహిస్తారా..? లేక హమాస్ నేతలకు మరో అవకాశం ఇస్తారా..? మధ్య వర్తులైన ఖతార్, ఈజిప్టు ప్రయత్నాలకు మద్దతిస్తారా.. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.