Riyaz Encounter: రియాజ్ ఎన్‌కౌంటర్.. ముగిసిన కానిస్టేబుల్ హత్య కేసు..!?

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) హత్య కేసు ప్రధాన నిందితుడు రియాజ్ (Riyaz) ఎన్‌కౌంటర్‌కు (Encounter) గురయ్యాడు. ఆదివారం అరెస్టయిన రియాజ్, సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులపై దాడికి యత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో, రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్‌పై దారుణంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించారు. ఇది పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కానిస్టేబుల్ హత్య తర్వాత రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో దాక్కున్న రియాజ్‌ను పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాలువలోకి దూకినప్పటికీ, స్థానికుల సహాయంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో గాయపడిన రియాజ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అరెస్ట్ సమయంలో ఎన్‌కౌంటర్ జరిగిందంటూ వచ్చిన వదంతులను నిజామాబాద్ సీపీ ఖండించారు.
చికిత్స పొందుతున్న రియాజ్‌ను సోమవారం ఉదయం వైద్య పరీక్షలకోసం ఆసుపత్రి నుంచి తీసుకువెళుతుండగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రియాజ్ అకస్మాత్తుగా కానిస్టేబుల్ నుంచి తుపాకీని లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, రియాజ్ తమపై ఆయుధాన్ని ఉపయోగించే అవకాశం లేదా పారిపోయే ప్రమాదం ఉందని భావించి, ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
రియాజ్ అరెస్ట్ సమయంలో తాము సంయమనం పాటించామని, అయితే ఇప్పుడు నిందితుడు ఏకంగా ఆయుధంతో దాడికి, పారిపోయేందుకు యత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మరోవైపు డీజీపీ శివధర్ రెడ్డి కూడా రియాజ్ ఎన్ కౌంటర్ ను ధృవీకరించారు. పోలీసులు ఆత్మరక్షణకోసం జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు ముగిసినట్లయింది. ఈ ఎన్‌కౌంటర్ ఉదంతం జిల్లాలో మరింత సంచలనం సృష్టించింది.