Bihar Elections: బిహార్ ఎన్నికల్లో ఎవరికి వారే…మహా గఠ్ బంధన్ పేరుకేనా..?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్’ లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆర్జేడీ (RJD) అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) వైశాలి జిల్లాలోని రాఘోపుర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. (Bihar Assembly Elections)
బిహార్ ఎన్నికల (Bihar Elections) రెండో విడతకు నామినేషన్ల గడువు నేటితో ముగియనున్న వేళ ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేయడం గమనార్హం. ఇప్పటికే తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల గడువు అక్టోబరు 17నే ముగిసింది. నామపత్రాల ఉపసంహరణకు సోమవారమే ఆఖరు తేదీ. అటు కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీనేత తేజస్వి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. దీని వల్లే ఇప్పటివరకు మహాగఠ్‌బంధన్ ఇంతవరకూ సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచారం.
అంతేకాదు.. తొలివిడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం గమనార్హం. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనం. బిహార్‌లో నవంబరు 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.