Trump: మామాట వింటే బాగుపడతారు.. లేదంటే టారిఫ్ బాదుడు తప్పదు.. భారత్ కు ట్రంప్ హెచ్చరిక..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నాలుక మడతపెట్టేశారు. గతంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య వార్ ను ఆపానంటూ పదేపదే ప్రకటించుకుని.. తర్వాత భారత్ కాదనేసరికి, చిన్నబుచ్చుకున్నారు ట్రంప్. ఇప్పుడు మళ్లీ చమురు కొనుగోళ్ల విషయంలోనూ భారత్ ప్రధాని నరేంద్రమోడీని ఇరికించేందుకు.. ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందంటూ కామెంట్ చేసిన ట్రంప్.. ఆమేరకు తనకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారన్నారు. అయితే దీన్ని భారత్ విదేశాంగశాఖ ఖండించింది. ట్రంప్, మోడీ మధ్య అలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదని తేల్చేసింది కూడా..
ట్రంప్ కామెంట్స్ ను భారత్ తోసిపుచ్చినా.. అమెరికా అధ్యక్షుడు మళ్లీ అదే పాట పాడారు. అంతేకాదు.. రష్యా చమురు (Russian Oil) కొనుగోళ్లు ఆపేంతవరకు న్యూఢిల్లీ భారీ టారిఫ్‌లు (Trump Traiffs) చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) నాతో స్వయంగా చెప్పారు’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ భారత్ అలా చెప్పాలనుకుంటే మాత్రం.. వారు భారీస్థాయిలో టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటారు. కానీ భారత్ అలా చేయబోదని నేను అనుకుంటున్నా’’ అని ట్రంప్ (Trump on Tariffs) అన్నారు.
గతవారం ట్రంప్ శ్వేతసౌధంలో మాట్లాడుతూ.. రష్యా (Russia) నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ క్రమంలో మోడీతో తాను మాట్లాడానని, మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తానని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై భారత్ (India) స్పందించింది. ట్రంప్-మోదీల మధ్య అలాంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమకు ముఖ్యమని పునరుద్ఘాటించారు.
మరోవైపు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు సంబంధించి ఇరుదేశాల మధ్య వైరుధ్యాలు చాలా వరకు సద్దుమణిగాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి.