Henry Ford Award: తెలుగు తేజం రాఘవేంద్ర చౌదరికి హెన్రీ ఫోర్డ్ పురస్కారం

అమెరికాలో ఉంటోన్న తెలుగు తేజం, డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి (Vemulapalli Raghavendra Chowdhury) కి హెన్రీ ఫోర్డ్ పురస్కారం (Henry Ford Award) లభించింది. అమెరికా డెట్రాయిట్‌లోని హెన్రీ ఫోర్డ్ హెల్త్ సంస్థలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ విశిష్ఠ సేవా పురస్కారం దక్కింది. గతంలో ఆయన హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రి (Hospital) లో పలు విభాగాల్లో పని చేసి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ మెడిసిన్ సేవల విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. గడచిన 3 దశాబ్దాల్లో వందల మంది వైద్యులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. డాక్టర్ వేములపల్లి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని వేలేరు. మద్రాసు స్టాన్లీ మెడికల్ కళాశాల నుంచి 1982లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నాక ఇంగ్లాండ్‌లో ఎఫ్‌ఆర్‌సీఎస్ చేశారు. 1995-1998 మధ్య హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో సేవలందించారు. హెన్రీ ఫోర్డ్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఈ నెల 23న డెట్రాయిట్‌లోని సెయింట్ మార్టినస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర చౌదరికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.