Revanth Reddy: దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర తెలంగాణకు : రేవంత్ రెడ్డి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. భూమి కొలతలు-భూదస్త్రాల నిర్వహణశాఖ పరిధిలో కొత్తగా నియమించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తో కలిసి ఆయన లైసెన్సులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర తెలంగాణ (Telangana)కు ఉంది. రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేసింది భూమిపై ఆధిపత్యానికే. ఆనాడు జల్ జమీన్ జంగిల్ నినాదంతో కుమురం భీం పోరాడిరది భూమి కోసమే. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ ( Nalgonda), వరంగల్ జిల్లాల్లో ఎర్రజెండా ఎగిరింది. భూమి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసింది. చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తినిచ్చింది. భూమిపై ఆధిపత్యం పెరిగిన ప్రతిసారీ తిరుగుబాటు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. భవిష్యత్‌లో భూ యాజమాన్య హక్కులు, సరిహద్దులను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ల చేతుల్లో పెట్టబోతోంది. తప్పులకు తావిస్తే మీతో పాటు ప్రభుత్వంపై భూ యజమానులు తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్నారు.