Mudragada Padmanabham: ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చిన గిరిబాబు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి (Mudragada Padmanabham Reddy) ఆరోగ్య పరిస్థితి కలవరం రేకెత్తిస్తోంది. ఆయన ఇటీవల తీవ్రమైన అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడ (Kakinada) లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించడం ప్రారంభించారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆయనకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ (Hyderabad) తరలించే విషయాన్ని ఆలోచించినట్టు సమాచారం. దీనిలో భాగంగా ఆయనను యశోదా హాస్పటల్ (Yashoda Hospital) కు తీసుకెళ్లాలని భావించారు. కానీ శనివారం రాత్రి దశలో మార్పులు చోటు చేసుకున్నాయి. సుమారు రాత్రి 10:30 గంటల సమయంలో ముద్రగడను కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రికి (Medicover Hospital) తరలించి అక్కడే చికిత్స కొనసాగించారు. ప్రస్తుతం అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో ముద్రగడకు చికిత్స కొనసాగుతోంది.
ఆయనకు శ్వాస సంబంధిత ఇబ్బందుల కారణంగా అస్వస్థత కలిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు (Giribabu) మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కొన్ని వార్తా ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ్డకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తలన్నింటికీ స్పష్టత ఇచ్చేందుకు ఆయన కుటుంబం ముందుకు వచ్చింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నా, ఆందోళనకర పరిస్థితిలో లేరని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. మీడియా వర్గాలు కూడా అధికారిక సమాచారం వచ్చే వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు.