Fake Liquor: కల్తీ మద్యం తయారీ.. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెలుగు చూసిన కల్తీ మద్యం (adulterated liquor) తయారీ, విక్రయాల రాకెట్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో అధికార టీడీపీ (TDP) నేతల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, ప్రతిపక్ష వైసీపీ దీనిని ఆయుధంగా మలుచుకోవడంతో ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అన్నమయ్య జిల్లా (Annamayya District) ములకలచెరువు (mulakalacheruvu), విజయవాడ, ఇబ్రహీంపట్నం కేంద్రాలుగా నడుస్తున్న ఈ దందాపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.
ఎక్సైజ్ శాఖ దర్యాప్తులో ఈ కల్తీ మద్యం రాకెట్ ఆర్గనైజ్డ్ నెట్‌వర్క్ బయటపడింది. అన్నమయ్య జిల్లా, ములకలచెరువులో ఒక రహస్య ఫ్యాక్టరీని అధికారులు గుర్తించారు. ఇక్కడ నాసిరకం స్పిరిట్‌ను, రసాయనాలను ఉపయోగించి ప్రముఖ బ్రాండ్‌ల నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో రూ. 1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, స్పిరిట్, ఖాళీ బాటిళ్లు, నకిలీ లేబుళ్లు, ప్యాకేజింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అద్దేపల్లి జనార్ధన్ రావును ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇతను విజయవాడలో బార్ లైసెన్స్ కలిగి ఉన్నారు. ఇతనితో పాటు తమిళనాడు, ఒడిశాకు చెందిన వ్యక్తులు ఈ తయారీలో పాలుపంచుకున్నట్లు తేలింది. కల్తీ మద్యాన్ని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వైన్స్ షాపులు, బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేతకు సంబంధించిన వైన్స్ షాప్‌ను కూడా సీజ్ చేశారు. ఈ పంపిణీ నెట్‌వర్క్ విజయవాడ, గుంటూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు విస్తరించి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కల్తీ మద్యం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ నేతలు, రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీదేనని ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం వెనుక కూటమి పెద్దలు ఉన్నారని, వారి కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తోందని చెప్తున్నారు. తద్వారా వచ్చే 30% కమీషన్లు పెద్దలకు చేరుతున్నాయని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దై, మళ్లీ ప్రైవేట్ సిండికేట్లు ఏర్పడ్డాయని, బెల్ట్ షాపులు, అక్రమ పర్మిట్ రూమ్‌లు పుట్టగొడుగుల్లా వచ్చాయని ఆరోపిస్తున్నారు.
అయితే వైసీపీ ఆరోపణలను టీడీపీ ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ మద్యాన్ని జీరో టాలరెన్స్ దృక్పథంతో చూస్తున్నారని, అందుకే సొంత పార్టీ నేతలైనా తప్పు చేసినట్లు ఆరోపణలు రాగానే వెంటనే సస్పెండ్ చేశారని సమర్థించుకుంటోంది. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించి, కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలకు సంకేతమిచ్చింది. కల్తీ మద్యం మాఫియాకు మూలవిరాట్ జగనేనని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం వ్యాపారం అధికారికంగా జరిగిందని చెప్తున్నారు. అప్పట్లో జైలుకు వెళ్లిన సొంత పార్టీ నేతలను జగన్ పరామర్శించారని కౌంటర్ ఇచ్చారు.
కల్తీ మద్యం కేసు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పాలనాపరంగా, నైతికంగా అతిపెద్ద సవాలుగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన నాణ్యమైన మద్యం హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండటం వల్ల, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారనే అపవాదును తుడిచిపెట్టుకోవాలి. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను గుర్తించడంతో పాటు, ఇందులో భాగమైన రాజకీయ పెద్దలు, ఎక్సైజ్ అధికారుల పాత్రను పారదర్శకంగా వెలికి తీయడం ప్రభుత్వానికి అత్యంత కీలకం. కేవలం స్థానిక నేతలపై చర్యలతో సరిపెట్టకుండా, ఈ మొత్తం సిండికేట్‌ను బద్దలు కొట్టాలని ప్రజలు, ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ స్పిరిట్ సరఫరా, బెల్ట్ షాపుల కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడానికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సి ఉంది. సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులతో సమన్వయం చేసుకుంటూ స్పిరిట్ సరఫరా గొలుసును ఛేదించాల్సిన అవసరం ఉంది.
మొత్తం మీద, ఈ కల్తీ మద్యం వ్యవహారం కేవలం ఒక నేర దర్యాప్తు కేసుగానే కాకుండా, ప్రభుత్వ విశ్వసనీయతకు, నైతికతకు సంబంధించిన అంశంగా మారింది. ప్రభుత్వం ఈ సవాలును ఏ విధంగా ఎదుర్కొని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో చూడాలి.