TTD: పరకామణి చోరీ కేసులో కీలక అధికారి అనుమానాస్పద మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్వో (AVSO) సతీష్‌కుమార్ (Satish Kumar) అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో సతీష్‌కుమార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయనది హత్యా, ఆత్మహత్యా అనేది తెలియట్లేదు. తాడిపత్రి (Tadipatri) సమీపంలో ఆయన మృతదేహం రైల్వే ట్రాక్ పై కనిపించింది. సతీశ్ కుమార్ మృతిపై అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం గుంతకల్లు (Guntakal) రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా (GRP Inspector) పనిచేస్తున్న సతీష్‌కుమార్ మృతదేహం తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై లభించింది. సతీష్‌కుమార్ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్‌కుమార్‌ను సీఐడీ అధికారులు విచారించారు. అనంతరం మరోసారి విచారణకు హాజరు కావాలని సీఐడీ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
టీటీడీ పరకామణి (Parakamani) చోరీ కేసు వెలుగులోకి రావడంలో మాజీ ఏవీఎస్వో (AVSO) సతీష్‌కుమార్ పాత్రే కీలకం. 2023 ఏప్రిల్‌లో టీటీడీ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌పై సతీష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీకి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. రవికుమార్ చోరీ చేస్తుండగా అప్పటి విజిలెన్స్ అధికారి అయిన సతీష్‌కుమార్ పట్టుకున్నారు. ఆయన ఫిర్యాదు మేరకే రవికుమార్ పై కేసు నమోదైంది. అలా సతీష్‌కుమార్ ఈ కేసులో ప్రధాన సాక్షిగా, చోరీని బయటపెట్టిన వ్యక్తిగా ఉన్నారు. అయితే ఆ తర్వాత రవికుమార్ తో టీటీడీ లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకుంది. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ ఎలా కుదుర్చుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును ప్రస్తుతం మళ్లీ విచారిస్తోంది ప్రభుత్వం.
సతీష్‌కుమార్ మృతిపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరకామణి కేసులో సతీష్ ఒక కీలకమైన వ్యక్తి అని ఆయన అన్నారు. ఆయన మృతిపై అనేక అనుమానాలున్నాయన్నారు. సతీష్‌ది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో ప్రభుత్వం లోతైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పరకామణి దొంగ రవికుమార్‌కు పోలీసు అధికారులు వెంటనే భద్రత కల్పించాలని ఆయన కోరారు.
వైసీపీ నేత, మాజీమంత్రి సాకే శైలజానాథ్ సైతం సతీష్‌కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్‌పై ఒత్తిడి వచ్చిందని, ఆయన మానసికంగా కుంగిపోయారని ఆయన అన్నారు. నాలుగు రోజుల సతీష్ విచారణలో ఏం జరిగిందో బయట పెట్టాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
పరకామణి కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతితో ఈ కేసు విచారణ మరింత సంక్లిష్టంగా మారింది. ఇది కేవలం దొంగతనం కేసు మాత్రమే కాదు. దీని వెనుక రాజకీయపరమైన ఆరోపణలు, ఒత్తిడి కోణాలు కూడా ఉన్నాయి. సతీశ్ కుమార్ మృతి తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాలి.






