JC Prabhakar Reddy : నా మీద ఉన్నన్ని కేసులు ఈ రాష్ట్రంలో .. ఎవరి మీదా లేవు : జేసీ
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను విధేయుడినని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అన్నారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆయన కూర్చోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తానని వ్యాఖ్యానించారు. విజన్ ఉన్న నాయకుడు కాబట్టే చంద్రబాబు (Chandrababu) ను ఫాలో అవుతూ తన ఊరిని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. డీపీవో నాగరాజు (DPO Nagaraju) అవినీతి, తీసుకున్న లంచాల చిట్టా ఆధారాలతో సహా తన వద్ద ఉందని, వాటిని కోర్టుకు అందజేస్తానని తెలిపారు. నా మీద ఉన్నన్ని కేసులు ఈ రాష్ట్రంలో ఎవరి మీదా లేవు. కరోనా సమయంలో నన్ను జైలుకు పంపిస్తే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి ఎలాంటి సౌకర్యాలు కల్పించవద్దని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారు. తాడిపత్రిలో ఎన్నో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. గత 8 నెలలుగా చాలా వినతులు డీపీవో, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌కు అందజేశాం. జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పినా డీపీవో ఆ లేఅవుట్ సంగతిని పెడచెవిన పెట్టారు. ఆ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. మా కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లోనే ఉంది. ఇప్పుడు చాలా మంది ఓవర్‌నైట్ పొలిటీషియన్లు పుట్టుకొచ్చారు. వాళ్లకు ఏమీ తెలియదు. నా ఊరి ప్రజలే, నా దేవుళ్లు. వారి అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తా అని అన్నారు.







