TDP: ప్రజా ప్రతినిధుల పనితీరు పై గ్రామీణ ప్రాంతాల్లో నిరాశ..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (NDA Alliance) ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావస్తుండటంతో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల పని తీరుపై చర్చలు ఊపందుకున్నాయి. ప్రజల్లోనూ ఈ విషయం మీద ఆసక్తి పెరిగింది. గడచిన ఏడాది కాలంలో కొన్ని నియోజకవర్గాల్లో మినహాయింపులు ఉంటే తప్ప, మిగిలిన చాలా ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, దాదాపు 10 నుండి 15 మందిని తప్ప మిగతా ఎమ్మెల్యేల పరిపాలనా శైలి పెద్దగా కనిపించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం చంద్ర బాబు (Chandra Babu) కాస్త సీరియస్ గా ఉన్నారు అని టాక్.
2024 ఎన్నికల్లో తొలిసారి గెలిచిన 80 మందిలో సుమారు 70 శాతం మంది ప్రజల మధ్యకు రావడం లేదని, వారికి అనుబంధం లేకపోవడం వల్ల ప్రజల మద్దతు తగ్గుతోందని చెప్పుకుంటున్నారు. వారితో జనం కలవాలంటే చక్కటి అవకాశం లేదన్న ఫీలింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ప్రాతినిధ్యం అనే భావన పరిపూర్ణంగా నిలబడడంలో సమస్యలు వస్తున్నాయని చెప్పవచ్చు.
తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన మొత్తం 134 మంది ఎమ్మెల్యేలలో మంత్రులను పక్కన పెడితే, మిగతావారిలో చాలా మంది ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపణలు వచ్చాయి. కేవలం కొంత మంది మాత్రమే కార్యాచరణల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. మిగతా వారు పూర్తిగా ఆఫీసులుకు పరిమితం కావడం వల్ల ప్రజల విశ్వాసం కొద్దిగా తగ్గుతోందని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై ఉన్న నమ్మకాన్ని ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో నిలబెట్టలేకపోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఆయన తరచూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రజల్లోనే ఉండాలని స్పష్టంగా చెప్పారు. అయితే, నగరాలు, పట్టణాల పరిధిలో కొంతవరకు ఎమ్మెల్యేలు కార్యాలయాలు నిర్వహిస్తూ ప్రజలను కలుస్తున్నారు. కానీ పట్టణాలకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా మన్యం (Agency areas) మరియు ఎస్సీ నియోజకవర్గాల్లో పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. అక్కడ చాలా చోట్ల ఎమ్మెల్యే కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాలను కూడా ఎన్నికల తర్వాత మూసేశారు.
కురుపాం (Kurupam), పాలకొండ (Palakonda) వంటి ప్రాంతాల్లో ప్రజలు ఎమ్మెల్యేలను కలవడం చాలా కష్టంగా మారిపోయింది. శింగనమల (Singanamala) నియోజకవర్గంలో మాత్రం ఒకే ఒక్క కార్యాలయం అందుబాటులో ఉంది. ప్రజలకు తమ ప్రజా ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశాలు లేకపోవడం వల్ల విశ్వాసం తగ్గిపోతోందనే అభిప్రాయం బలపడుతోంది. గతంలో 100 శాతం మద్దతుగా ఉన్న గ్రామాల్లో ఇప్పుడు ఆ స్థాయి 70 శాతానికి పడిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.మరి ఈ పరిస్థితులో చంద్ర బాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ..