AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల రూపకల్పన..ప్రభుత్వం ముందున్న సవాళ్లు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జిల్లాల పునర్విభజన మరోసారి చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల వ్యవస్థ అమల్లో అనేక ఇబ్బందులు తలెత్తినట్లు ప్రజలు అప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మదనపల్లె జిల్లా (Madanapalle District) ఏర్పాటుపై అక్కడి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల మండలాలను ఈ జిల్లాలో చేర్చడం ఆ ప్రాంత ప్రజలు సానుకూలంగా స్వీకరించారు. అయితే రొంపిచెర్ల మండలాన్ని చిత్తూరు జిల్లా (Chittoor District)లో కొనసాగించడం కొంతమందికి నచ్చలేదు. పీలేరు రెవెన్యూ డివిజన్ దగ్గరగా ఉండడంతో అక్కడే ఉండాలని రొంపిచెర్ల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు పులిచెర్ల మండలం చిత్తూరులోనే ఉండడంపై వారి సంతృప్తి వ్యక్తమవుతోంది.
నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లా (Tirupati District)లో చేర్చుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు కాలేదని అక్కడి ప్రజలు అసంతృప్తి చూపుతున్నారు. క్యాబినెట్ సబ్-కమిటీ సిఫార్సు చేసినప్పటికీ అమలు కాకపోవడం వారికి ఆశ్చర్యంగా మారింది. మార్కాపురం జిల్లా (Markapur District) ఏర్పాటుపై సాధారణంగా సానుకూలత కనిపిస్తున్నప్పటికీ కనిగిరి డివిజన్లో కలపడం గిద్దలూరు ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గూడూరు, వెంకటగిరి మండలాలు నెల్లూరు జిల్లా (Nellore District) నుంచి దూరంగా ఉండటం వల్ల అక్కడి ప్రజలు అసౌకర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నుంచి నెల్లూరుకు 36 కి.మీ. అయితే తిరుపతికి 110 కి.మీ. ఉండటం ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైగా ఎన్నికలకు ముందు గూడూరులో నెల్లూరులోనే కలుపుతామని చంద్రబాబు (Chandrababu) , లోకేష్ (Lokesh) ఇచ్చిన హామీలను వారు గుర్తు చేస్తున్నారు.
కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లా (Tirupati District)లోని గూడూరు రెవెన్యూ డివిజన్లో కలపడం కూడా తీవ్ర ఆక్షేపణలకు దారి తీసింది. ఈ మూడు మండలాలకు నెల్లూరు దగ్గరగా ఉండగా, తిరుపతి 160 కి.మీ. దూరంలో ఉండటం వాళ్ళు చూపుతున్న ప్రధాన సమస్య. కృష్ణా జిల్లా (Krishna District) పరిధిలో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో చేర్చకపోవడం కూడా అక్కడి ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. అభివృద్ధి పరంగా గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు ఉన్నందున స్థానికులు తమ భవిష్యత్తు పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లా (Annamayya District)లో చేర్చడం కడప జిల్లా (Kadapa District) ప్రజలకు నచ్చలేదు. ఒంటిమిట్ట నుంచి కడప 25 కి.మీ. మాత్రమే ఉండగా, రాయచోటి 90 కి.మీ. దూరంలో ఉండటం ప్రజలకు ఇబ్బందులను కలిగించవచ్చని భావిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రభుత్వం ఎలా పరిగణలోకి తీసుకుంటుందో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.






