TDP: విశాఖ లో అధ్యక్ష పదవి కోసం సామాజిక వర్గాల పోటీ.. టీడీపీకి కొత్త సవాల్

విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం కోసం ఈసారి జరుగుతున్న పోటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. ఎందుకంటే విశాఖలాంటి ప్రతిష్టాత్మక జిల్లాకు ఈ హోదా దక్కడం అంటే పార్టీ లోపల పెద్ద గుర్తింపు వచ్చినట్లే. ముఖ్యంగా ఈ జిల్లా ఎప్పటి నుంచీ తెలుగుదేశానికి బలమైన అడ్డాగా ఉండటంతో పాటు తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వంటి ప్రముఖ నేతలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందువల్ల ఈ బాధ్యత మంత్రి పదవితో సమానంగా భావించేంత ప్రాధాన్యం కలిగినదే.
ఇప్పుడు ఈ స్థానం ఖాళీ కావడంతో వివిధ నియోజకవర్గాల నేతలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా భీమునిపట్నం (Bheemunipatnam) ప్రాంతం నుంచి అరడజను మంది రేసులో ఉన్నారని చెబుతున్నారు. వారిలో ఒక మహిళా కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఆమెకు ఇంతకు ముందు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే మంచి గుర్తింపు వస్తుందని ఆమె అనుచరులు భావిస్తున్నారు. విశాఖలో తొలిసారి మహిళా అధ్యక్షురాలు అవ్వడం కూడా రికార్డుగా నిలుస్తుందని అంటున్నారు.
అలాగే భీమిలీ (Bheemili) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) శ్రేయోభిలాషుల నుంచి కూడా ఒకరు పోటీలో ఉన్నారని సమాచారం. ఇక కాపు వర్గం ఈసారి ఈ పదవి దక్కించుకోవాలని కృషి చేస్తోందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదని, అయితే కాపులు ఇక్కడ ఎక్కువగా ఉన్నందున వారికి ప్రాధాన్యం కల్పిస్తే సమీకరణాలు సరిగ్గా సరిపోతాయని పార్టీ లోపలే చర్చ జరుగుతోందట.
ఇంకో వైపు కమ్మ వర్గానికి ఇప్పటివరకు ఈ పదవి రాకపోవడం గమనార్హం. రెడ్డి, కాపు, ఇతర వర్గాలకు ఈ హోదా లభించినా కమ్మలకు మాత్రం అవకాశం రాలేదని గుర్తు చేస్తున్నారు. విశాఖ తూర్పు (Visakha East) ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు (Velagapudi Ramakrishnababu) సమీప బంధువైన ఒక నేతను ఈ పదవికి పరిశీలిస్తున్నారని వినిపిస్తోంది. పార్టీకి నిబద్ధతతో పనిచేసిన కమ్మలకూ ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
అలాగే ఇటీవల విశాఖ నుండి పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం పొందగా, యాదవ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించబడింది. మేయర్ స్థానాన్ని గవర వర్గానికి ఇచ్చారు. ఇంతకుముందు వెలమ వర్గానికి కూడా ఈ పదవి దక్కింది. ప్రస్తుతం సామాజిక సమతుల్యత దృష్ట్యా విజయనగరం (Vizianagaram) అధ్యక్ష పదవి కాపులకు, శ్రీకాకుళం (Srikakulam) పదవి కాళింగులకు ఇచ్చిన పరిస్థితిలో, విశాఖ జిల్లా హోదా కమ్మలకు ఇవ్వడం సమంజసమని కొందరు భావిస్తున్నారు.
మరోవైపు మైనారిటీ వర్గం నుంచి కూడా ఈ స్థానం మీద ఆసక్తి కనబడుతోంది. వారిని కూడా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంటే సమీకరణాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే విశాఖ జిల్లా అధ్యక్ష పదవి కేవలం ఒక హోదా కాదు, రాబోయే రాజకీయ సమీకరణాల్లో కీలకమైన అస్త్రంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.