CRDA: అమరావతి రీలాంఛ్.. ఫస్ట్ పర్మినెంట్ బిల్డింగ్ రెడీ..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) పునఃప్రారంభమైన తర్వాత తొలి శాశ్వత నిర్మాణం పూర్తయింది. కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ – CRDA భవనం పూర్తి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వేద మంత్రోచ్ఛారణల మధ్య దీన్ని ప్రారంభించారు. అమరావతిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి శాశ్వత అత్యాధునిక ప్రభుత్వ భవనం ఇదే కావడం విశేషం. ఈ భవనం కేవలం కార్యాలయం మాత్రమే కాదు, అమరావతి నగర రూపకల్పన, అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలకు ఒక ప్రతీకగా నిలవనుంది.
CRDA భవనం రాయపూడి సమీపంలో, సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద నిర్మించారు. దీని మొత్తం విస్తీర్ణం 4.32 ఎకరాలు. 3,07,326 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. G+7గా అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో ఏడు అంతస్తుల్లో నిర్మాణం చేశారు. దాదాపు రూ.257 కోట్లు దీనికోసం వెచ్చించారు. భవనం ముఖభాగంలో ‘A’ అక్షరం వచ్చేలా ఎలివేషన్ డిజైన్ చేశారు. అమరావతి నగరానికి చిహ్నంగా ఇది నిలుస్తుంది. దేశంలోనే IGBC నెట్ జీరో ఎనర్జీ రేటింగ్ పొందిన తొలి ప్రభుత్వ భవనంగా ఇది చరిత్ర సృష్టించింది. HVAC వ్యవస్థలు, LED లైటింగ్ వినియోగం, 540 kWp రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ వ్యవస్థ ద్వారా వంద శాతం పునరుత్పాదక ఇంధన వినియోగం ఈ భవనం ప్రత్యేకత.
CRDA భవనం అమరావతి రాజధాని ప్రాంతానికి పాలనా కేంద్రంగా పనిచేయనుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. అమరావతిలోని అన్ని అభివృద్ధి, నిర్మాణ పనుల పర్యవేక్షణ, సమన్వయం ఇక్కడి నుంచే జరుగుతుంది. అలాగే, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ద్వారా రాజధాని విజన్‌ను ప్రజలకు వివరిస్తారు. మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ హాళ్లు ఉన్నాయి. ఉన్నత స్థాయి సమీక్షలు, సమావేశాలకు ఇది వేదిక. 2, 3, 5 అంతస్తుల్లో ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళిక, అమలుకు సంబంధించిన కీలక కార్యకలాపాలు ఉంటాయి. 4వ అంతస్తులో పురపాలక పరిపాలన డైరెక్టరేట్ (CDMA) ఉంటుంది. రాష్ట్రంలోని మున్సిపల్ వ్యవహారాలను ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. 6వ అంతస్తులో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADCL), రాజధాని నిర్మాణ ప్రాజెక్టుల అమలు బాధ్యతలు నిర్వర్తిస్తారు.7వ అంతస్తులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఛాంబర్ తో పాటు ఉన్నత స్థాయి రాజకీయ, పాలనాపరమైన ఛాంబర్లు ఉన్నాయి.మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖకు సంబంధించిన అన్ని హెచ్‌ఓడీలు ఒకే చోట కేంద్రీకృతం కావడం ద్వారా పాలనలో వేగం, సమన్వయం పెరుగుతాయి.
ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పట్ల తన దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. రాజధాని నిర్మాణానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భూ సమీకరణ ప్రపంచంలోనే అతిపెద్ద, విశిష్టమైన కార్యక్రమం అని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని ప్రాజెక్టు అని, దీని కోసం రాష్ట్ర ఖజానా నుండి పెద్దగా నిధులు ఖర్చు చేయవలసిన అవసరం లేదని, భూముల విలువ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.
అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, క్వాంటమ్ వ్యాలీగా, ఆధునిక టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విశాఖపట్నం వంటి నగరాలతో పాటు అమరావతి కూడా నూతన టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. CRDA భవనం ప్రారంభం ద్వారా అమరావతి నిర్మాణ ప్రయాణంలో తొలి మైలురాయి అని, ఇక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు వేగవంతమైన పునాది పడుతుందని ఉద్ఘాటించారు.
ఈ భవనం ప్రారంభోత్సవం ద్వారా అమరావతి రాజధాని వ్యవహారాలు మళ్లీ పట్టాలెక్కాయని, ఇక్కడి నుంచే పరిపాలన సాగించడం ద్వారా రాజధాని నగర రూపకల్పన వేగవంతం అవుతుందని రాజకీయ, పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి.