Trump: గాజా పోరు ముగిసింది.. ఇక పాక్-అఫ్గాన్ యుద్ధం సంగతి చూస్తామన్న ట్రంప్..

ఎక్కడ యుద్దోన్మాదం కనిపించినా ఉపేక్షించను… నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను.. ప్రపంచానికి పెద్దన్నను.. నా అనుమతి లేకుండా ఏం జరగకూడదు.. ఇదీ ట్రంప్ స్టైల్. ప్రపంచంలో ఏమూల సైనిక ఘర్షణ జరిగినా ట్రంప్ (US President Donald Trump) అప్రమత్తమైపోతున్నారు. ఏడు యుద్ధాలను ఆపినట్లు వెల్లడించిన ఆయన తాజాగా ఎనిమిదో యుద్ధం ఆపబోతున్నట్లు వెల్లడించారు. గాజా (Gaza) ఒప్పందం కోసం పశ్చిమాసియాకు పయనమైన వేళ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
‘‘నేను ఆపిన ఎనిమిదో యుద్ధం (గాజాలో) అవుతుంది. పాకిస్థాన్-అఫ్గానిస్థాన్‌ల మధ్య కూడా యుద్ధం (Pakistan and Afghanistan War) జరుగుతోందని విన్నాను. నేను తిరిగి వచ్చేవరకు ఆగుతాను. నేను యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని’’ అని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్‌లను ఆయుధంగా వాడి తాను సంక్షోభాలను పరిష్కరించానని పునరుద్ఘాటించారు. దీనికి భారత్-పాక్ సైనిక ఘర్షణను ఆయన ఉదాహరణగా చూపారు. ఇరుదేశాలపై 100 నుంచి 150, 200శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించడంతో 24 గంటల్లో యుద్ధం ఆగిపోయిందన్నారు. టారిఫ్‌లు లేకపోతే తాను ఎప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోయేవాడినని వెల్లడించారు.
రష్యా రాజీకి రాకపోతే తోమహాక్ రంగంలోకి ..
ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మాస్కో రాజీకి రాకపోతే.. తాను కీవ్‌కు తోమహాక్ క్షిపణులను అందజేస్తానని హెచ్చరించారు. అది పుతిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని ఆయన వివరించారు. అదే సరైన చర్య అని అభివర్ణించారు. ఆదివారం ఉదయం ట్రంప్ ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీతో మాట్లాడిన తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. తమ మధ్య తోమహాక్‌పై సంభాషణ జరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు.