Washington: తోమహాక్.. ప్రపంచాన్ని వణికించిన విధ్వంసక క్షిపణి..

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగకుంటే తాను కీవ్ కు తోమహాక్ దీర్ఘ శ్రేణి విధ్వంసక క్షిపణిని అందిస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump). దీంతో రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. అయితే ట్రంప్ ప్రకటనపై.. పుతిన్ స్పందించారు. వాటిని ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తే గనక మాస్కో-వాషింగ్టన్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. తాజాగా క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఉద్రిక్తతలు నాటకీయంగా పెరిగిపోతాయని అభివర్ణించారు. ‘‘ఒక దీర్ఘశ్రేణి క్షిపణి రష్యా పైకి దూసుకొస్తుంటే.. దానిలో అణ్వాస్త్రం కూడా ఉండొచ్చని మేము భావిస్తాం. అప్పుడు మేము(రష్యా) ఎలా ప్రతిస్పందించాలో సైనిక నిపుణులే అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
తోమహాక్ ప్రత్యేకతలు..
దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా చాలా యుద్ధాల్లో అమెరికా అత్యధికంగా ఉపయోగించిన ఆయుధాల్లో తోమహాక్ కూడా ఒకటి. ఇరాక్, సిరియా, లిబియా, గల్ఫ్, యెమెన్ యుద్ధాల్లో దీనిని అమెరికా విపరీతంగా వాడింది. తోమహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్‌ను సముద్రంలో నౌకలు, జలాంతర్గాముల నుంచి శత్రు స్థావరాల పైకి ప్రయోగించవచ్చు.
తొలిసారి 1970ల్లో ప్రచ్ఛన్నయుద్ధం వేళ దీని తయారీ తెర పైకి వచ్చింది. జనరల్ డైనమిక్స్ దీనిని అభివృద్ధి చేసింది. 1983 నాటికి అమెరికా సైన్యం చేతికి వచ్చింది. బూస్టర్ కాకుండా 5.6 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 880 కిలోమీటర్ల వేగం (సబ్‌సోనిక్)తో ప్రయాణించగలదు. ఉపరితలానికి కేవలం 30-35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండటంతో.. ఇది చాలా దగ్గరికి వచ్చేవరకు దీన్ని రాడార్లు గుర్తించలేవు. సుమారు 450 కిలోల సంప్రదాయ వార్‌హెడ్‌ను దీనిలో అమర్చవచ్చు. అగ్రరాజ్యం వద్ద ఉన్న 140 నౌకలు, జలాంతర్గాముల్లో దీనిని ప్రయోగించే ఏర్పాట్లు ఉన్నాయంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
ఇరాక్ పై డిజర్ట్ స్ట్రామ్ లో..
ఇరాక్‌పై డిజర్ట్‌స్ట్రామ్ పేరుతో అమెరికా చేపట్టిన యుద్ధంలో మొట్టమొదట బాగ్దాద్‌పై ప్రయోగించిన ఆయుధం ఇదే. మొత్తం 42 రోజులపాటు జరిగిన ఈ వార్‌లో అమెరికా మొత్తం 297 క్షిపణులను వాడింది. వీటిల్లో 282 లక్ష్యాలను తాకాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఎత్తు నుంచి.. మరికొన్నిసార్లు తక్కువ ఎత్తు నుంచి ప్రయాణిస్తూ.. శత్రువును గందరగోళానికి గురిచేసి బాగ్దాద్‌పై విరుచుకుపడ్డాయి. ఒక్కో క్షిపణి ఖరీదు 2 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ క్షిపణిలో స్మార్ట్ నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. దీంతో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యం వైపు దూసుకెళతాయి. జీపీఎస్, ఇనర్షల్ నేవిగేషన్ సిస్టమ్‌ను వాడుకొంటాయి. ముందుగానే లోడ్ చేసిన మ్యాప్‌లను అనుసరిస్తూ టార్గెట్‌ను చేరుకోగలదు. అత్యాధునిక డేటా లింక్‌లు కూడా దీనికి ఉన్నాయి. ఫలితంగా మార్గమధ్యలో దీని దిశను మార్చవచ్చు. అవసరం అనుకుంటే మిషన్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది.