Israel: రెండేళ్ల తర్వాత నరకం నుంచి విముక్తి… హమాస్ బందీల విడుదల.. ఇజ్రాయెల్ లో పండుగ వాతావరణం

రెండేళ్ల పాటు నరక జీవితం.. బతుకుతారో, లేదో తెలియదు.. వారిని హమాస్ ఉగ్రవాదులు.. సజీవంగా ఉంచుతారో చంపేస్తారో తెలియదు. ఇలాంటి వాతావరణంలో రెండేళ్ల పాటు బందీల కుటుంబాలు క్షణమొకయుగంలా బతికాయి. తమవారిని విడిపించాలంటూ ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) పుణ్యమాని.. వారి నిరీక్షణకు తెరపడింది.
తొలివిడత బందీలను హమాస్ విడుదల చేసింది.దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. టెల్ అవీవ్‌లో భారీ హర్షధ్వానాలు వినబడుతున్నాయి. పెద్ద ఎత్తున థ్యాంక్స్ ట్రంప్ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది ఇజ్రాయెలీయులు రోడ్లపైకి వచ్చి ఆనంద భాష్పాలు కురిపిస్తున్నారు. తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసిందని ఐడీఎఫ్ తెలిపింది.
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో సోమవారం మూడు విడతల్లో బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడత బందీలను రెడ్‌క్రాస్ బృందానికి హమాస్ అప్పగించింది. దీంతో ఇజ్రాయెల్‌లో హర్షధ్వానాలు వినబడుతున్నాయి. థ్యాంక్యూ ట్రంప్ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి.
మరోవైపు…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఈమేరకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ను ట్రంప్ కు అందించి గౌరవించనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ పేర్కొన్నారు. హమాస్ చెరలో రెండేళ్లుగా మగ్గుతున్న తమ పౌరులను విడిపించినందుకు గానూ ఆయనకు ఈ పురస్కారం ప్రకటించినట్లు తెలిపారు.
గాజా ఒప్పందం కుదర్చడంలో, బందీల విడుదలలో ట్రంప్ చేసిన కృషిని ఇజ్రాయెల్ ప్రజలు తరతరాల పాటు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ట్రంప్ అవిశ్రాంత కృషి కారణంగానే హమాస్ చెరలో ఉన్న తమ పౌరులు తిరిగి వస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్‌లోనే కాకుండా మధ్యప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని ఇస్సాక్ హెర్జోగ్ కొనియాడారు.