Dammalapati: ఏపీ అడ్వొకేట్ జనరల్‌పై చంద్రబాబు అసంతృప్తి..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా న్యాయపరమైన చిక్కులు వీడడం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సీరియస్ యాక్షన్‌కు సిద్ధమయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అడ్వొకేట్ జనరల్ (AG) దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. త్వరలోనే ఆయనను ఆ పదవి నుంచి తప్పించి, మరొక సమర్థుడికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అమరావతి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ అడ్వొకేట్ జనరల్ గా పనిచేసిన అనుభవం ఉండటంతో, చంద్రబాబు ఈసారి కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ పై నమ్మకం ఉంచారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితులు, గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటాల్లో ఏజీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసుల్లో కూడా కోర్టుల్లో బలం చూపించలేకపోవడం, ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించడంలో విఫలం కావడం సీఎం అసహనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అంతేకాక, ఏజీ దమ్మాలపాటి వైసీపీ నేతల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారినా, ఇంకా కోర్టుల్లో పాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PPలు), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (APPలు) కొనసాగుతుండటంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే ఇంకా కొనసాగించడం వెనుక ఏజీ ఉదాసీనత ఉందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా, అనేక కేసుల్లో అరెస్ట్ అయిన కీలక వైసీపీ నేతలకు చాలా సులభంగా బెయిల్స్ వస్తుండటం వెనుక ఏజీ కార్యాలయం పాత్ర ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కోర్టులో కౌంటర్లు దాఖలు చేయడంలో జాప్యం, బలహీనమైన వాదనలు వినిపించడం వల్ల పరోక్షంగా ప్రతిపక్ష నేతలకు మేలు జరుగుతోందనే భావన ప్రభుత్వ పెద్దల్లో నెలకొంది.
ఇటీవల ఏజీ దమ్మాలపాటి తీసుకున్న ఒక నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరపున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డికి సంబంధించిన బకాయిల ఫైల్‌ను దమ్మాలపాటి ఆగమేఘాల మీద క్లియర్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నప్పుడు, టీడీపీని ఇబ్బంది పెట్టిన కేసుల్లో వాదించిన లాయర్‌కు నిధులు విడుదల చేయడానికి ఏజీ ఎందుకు అంత ఆసక్తి చూపారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ఇది చంద్రబాబు ఆగ్రహానికి తక్షణ కారణమైందని సమాచారం.
ఏజీ పనితీరుపై నమ్మకం సన్నగిల్లడంతో, రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న కేసులకు కూడా ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను రప్పించాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని మోపుతోంది. స్థానికంగా ఉన్న అడ్వొకేట్ జనరల్ బృందం సమర్థవంతంగా పనిచేస్తే ఈ అవసరం ఉండేది కాదు. అటు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఇటు ఢిల్లీ లాయర్ల వల్ల ఆర్థిక భారం పెరగడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇది పరిపాలనా దక్షుడిగా పేరున్న చంద్రబాబు ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన లాయర్లను కాదని, ఏజీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ న్యాయ విభాగం (Legal Cell) గుర్రుగా ఉంది. దమ్మాలపాటి తీరుపై సొంత పార్టీ లాయర్లే బహిరంగ విమర్శలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. మమ్మల్ని నమ్ముకుని ప్రభుత్వం లేదు, కానీ ప్రభుత్వమే మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనే రీతిలో ఏజీ వ్యవహారశైలి ఉందని లాయర్లు వాపోతున్నారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనేక కీలకమైన పాలసీ నిర్ణయాలు, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి అంశాలపై న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ తరుణంలో న్యాయ విభాగం అత్యంత పటిష్టంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దమ్మాలపాటిని కొనసాగిస్తే న్యాయపరంగానే కాకుండా, రాజకీయంగా కూడా నష్టం వాటిల్లుతుందని సీఎం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, దమ్మాలపాటి శ్రీనివాస్ ను గౌరవప్రదంగా తప్పించి, ఆయన స్థానంలో న్యాయ కోవిదుడు, దూకుడుగా వాదించగల సమర్థుడైన మరో సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు అన్వేషణ ప్రారంభమైనట్లు సమాచారం.






