Chandrababu: 2029 కి 100 శాతం ఆధిపత్యం వైపు చంద్రబాబు అడుగులు..

ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి 2024లో ప్రజలు గొప్ప మెజారిటీ ఇచ్చారు. ఈ విజయ పరంపర కొనసాగించడం కోసం కూటమి 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది .ఈ విధమైన దృక్కోణం రాజకీయాల్లో కొత్తది కాదు. రాజకీయ నాయకులు ఒకసారి అధికారంలోకి వచ్చిన తరువాత వారి దృష్టి ప్రజల పాలన కంటే కూడా తిరిగి గెలవడంపైనే ఎక్కువగా ఉండటం మనం గతంలో ఎన్నోసార్లు చూశాం.
అందుకు ఉదాహరణగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ (Y. S. Rajasekhara Reddy)ను చెప్పొచ్చు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్దిపాటి రోజుల్లోనే 2014 ఎన్నికల విషయమై పార్టీ నేతలకు దిశానిర్దేశం ఇచ్చారు. పార్టీ స్థితిగతుల గురించి చర్చిస్తూ, భవిష్యత్తులో పార్టీ ను బలంగా నిలబెట్టాలని, రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రధానిగా చూడాలని భావించారు. ఇది ఒక రాష్ట్ర సీఎం నుంచే దేశ స్థాయి ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చిన సందర్భం.
ఇక 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పరిపాలనలో అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలన్నీ 2019లో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే అమలయ్యాయి. కానీ 2019లో అనూహ్యంగా జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నాయకత్వంలోని వైసీపీకి (YSRCP) స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఆ తరువాత మూడేళ్లు, ఐదేళ్లపై కాదు, ముప్పై ఏళ్లపాటు పాలించాలన్న ధీమాతో ముందుకెళ్లింది. కానీ 2024లో భారీ ఓటమిని ఎదుర్కొంది. అయితే దీనికి ప్రధాన కారణం పార్టీపై ప్రజలలో పెరిగిన వ్యతిరేకత అన్న విషయం అందరికీ తెలిసిందే.
గత ప్రభుత్వం చేసిన తప్పులను అంచనా వేస్తూ..తమ పార్టీని ప్రజలు సపోర్ట్ చేసేలా కూటమి ముందు అడుగు వేస్తోంది.ఇప్పుడు 2024 ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకున్న కూటమిలో టీడీపీకి 135 సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం తన పార్టీపై మరింత నిఘా పెడుతూ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా పని చేస్తున్నారన్నదానిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. పనితీరు మెరుగుపర్చని వారిపై చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వందకు పైగా సీట్లలో తిరిగి గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నియోజకవర్గాలను పోటీకి కూడా ఇతర పార్టీలు జంకేలా మార్చాలన్నదే ఆ పార్టీ లక్ష్యం.
ఇందుకోసం అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ప్రజలతో కలిసిమెలిసి ఉండే విధానం ఆధారంగా కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనితీరు సాగిస్తే మాత్రం తిరిగి గెలుపు ఖాయమన్నది ఆ పార్టీ వ్యూహం. ఇది జరిగితే వైసీపీకి మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో గట్టి ఎదురుదెబ్బ తగలటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.