Chandrababu: కల్తీ నెయ్యి విచారణ కోసం ఏకసభ్య కమిషన్ .. చంద్రబాబు ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ, ఈ అపచారాన్ని “క్షమించరాని మహా పాపం”గా ఆయన అభివర్ణించారు. ఈ వ్యవహారంపై నిజానిజాలను వెలికితీసేందుకు ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు.
ఉండవల్లిలో జరిగిన కూటమి నేతల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మంపై, భక్తుల మనోభావాలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని ఆరోపించారు. 2022లోనే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) నెయ్యి కల్తీ జరుగుతోందని నివేదిక ఇచ్చినప్పటికీ, అప్పటి పాలకులు ఆ నివేదికను తొక్కిపెట్టారని ఆయన మండిపడ్డారు. యథేచ్ఛగా పామాయిల్, ప్రమాదకర రసాయనాలు, చివరికి జంతువుల కొవ్వుతో (Animal Fat) కలిసిన నెయ్యిని సరఫరా చేస్తూ భక్తుల పవిత్రతను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
“దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. గతంలో అంతర్వేది రథం దహనం, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలను అప్పటి పాలకులు చులకన చేసి మాట్లాడారు. ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొడితే అదో బొమ్మ కదా అని హేళన చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దైవ సంప్రదాయాలను గౌరవించారు, కానీ గత ఐదేళ్లలో అరాచకం రాజ్యమేలింది” అని చంద్రబాబు విమర్శించారు.
తాను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మానవ సేవ కంటే మాధవ సేవ మిన్న అని భావించి, తిరుమల ప్రక్షాళన కోసం టీటీడీ ఈఓగా శామలరావును నియమిస్తూ తన రెండో సంతకం చేశానని గుర్తు చేశారు. ఎన్డీడీబీ (NDDB) పరీక్షల ద్వారానే కల్తీ నిజమని తేలిందని, ఇప్పుడు సిట్ (SIT) విచారణలో మరిన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ కోసం ఏకసభ్య కమిషన్ను నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలను, లభించిన ఆధారాలను ఈ కమిషన్ ముందు ఉంచుతారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన కరడుగట్టిన నేరస్థులను వదిలిపెట్టేది లేదని, అవసరమైతే కోర్టులో అదనపు సమాచారాన్ని సమర్పిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు జరగకుండా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.
“వైసీపీ నేతలకు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు, కానీ విశ్వాసం ఉన్న కోట్ల మంది మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో ప్రతి సామాన్య భక్తుడు ముక్తకంఠంతో ఖండించాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చేస్తున్న ఎదురుదాడిని ఆయన తప్పుపట్టారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదని, అసత్యాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన ఈ అపచారం కేవలం ఒక రాజకీయ విమర్శ మాత్రమే కాదు, అది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని చంద్రబాబు నొక్కి చెప్పారు. ప్రభుత్వం నియమించబోయే ఏకసభ్య కమిషన్ ద్వారా త్వరలోనే ఈ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






