Pakistan: అమెరికాకు భారత్ విలువైన భాగస్వామి.. మరి పాకిస్తాన్ సంగతి..?
భారత్ తో అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రపంచదేశాల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతుంటే….పాకిస్తాన్ లో మాత్రం ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే.. ప్రతీవిషయంలో భారత్ తో పోల్చి చూసుకునే పాక్ ప్రజలు, నేతలు… ఈ ఒప్పందాన్ని సైతం అలాగే పరిశీలిస్తున్నారు. భారత్ కు 18శాతం పన్ను.. మనకు మాత్రం 19 శాతం.. ఇదెక్కడి న్యాయమంటూ పాక్ సర్కార్ పై మండిపడుతున్నారు. ఈ పరిణామం పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి శరాఘాతమని చెప్పాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి నెలల తరబడి ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని విశ్లేషకులు, విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు భారత్ ఒకశాతం తక్కువ పన్నుతో మార్కెట్ లో అధిక భాగాన్ని ఆక్రమిస్తుందన్న భయం పాకిస్తాన్ వ్యాపారుల్లో కనిపిస్తోంది. అది కాస్తా.. ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమవుతోంది.
ఫిబ్రవరి 2న ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గించారు. అయితే, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, ఆయనకు భారీ స్థాయిలో ‘రెడ్ కార్పెట్’ స్వాగతం పలికిన పాకిస్థాన్‌కు మాత్రం 19 శాతం సుంకాన్ని ఖరారు చేశారు. ఈ ఒక్క శాతం వ్యత్యాసం పాకిస్థాన్‌లో ఆత్మగౌరవ పోరాటంగా మారింది.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు మోడీలో ఒక భాగస్వామి కనిపిస్తే, పాక్ పాలకులలో కేవలం ఒక మేనేజర్ కనిపించాడు. అందుకే భారత్ 18 శాతం రేటుతో విజేతగా నిలిచింది” అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు… పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పరిస్థితిని ఒక ‘నిస్సహాయ ప్రేమికుడి’తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
మాజీ మంత్రి హమ్మద్ అజార్ ఈ పరిణామాలను పాక్ విదేశాంగ విధాన వైఫల్యంగా అభివర్ణించారు. “21వ శతాబ్దపు విదేశాంగ విధానం అంటే ఫొటోలు దిగడం లేదా భజన చేయడం కాదు. అది ఆర్థిక బలం, మార్కెట్ ప్రాప్యతపై ఆధారపడి ఉంటుంది. భారత్ తన ఆర్థిక శక్తితో అమెరికాను ఒప్పించగలిగింది” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఒప్పందం వల్ల రాబోయే పదేళ్లలో భారత్‌కు సుమారు 150 బిలియన్ డాలర్ల అదనపు ఎగుమతి ఆదాయం సమకూరనుంది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే భారత్ ఇప్పుడు అమెరికా మార్కెట్లో తక్కువ సుంకంతో వస్తువులను విక్రయించే అవకాశం పొందింది. మరోవైపు, బలూచిస్థాన్‌లోని ఖనిజ సంపదను అమెరికాకు ఆఫర్ చేసినా దక్కని గౌరవం, భారత్ తన ‘స్ట్రాటజిక్ అటానమీ’ (వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) ద్వారా సాధించిందని పాక్ మీడియా విశ్లేషిస్తోంది.






