Bhumana Karunakar Reddy: టీడీఆర్ బాండ్ల కుంభకోణం పై భూమన సంచలన వ్యాఖ్యలు..

తిరుపతి (Tirupati) నగరంలో టీడీఆర్ బాండ్ల (TDR Bonds) అంశం మళ్లీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇటీవల వైసీపీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కొత్త మలుపు తిప్పాయి. ఆయన గత ప్రభుత్వ కాలంలోనే ఈ స్కాం జరిగిందని బహిరంగంగా చెప్పడంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరింత సీరియస్‌గా వ్యవహరించబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్ వ్యవహారంపై ప్రాథమిక స్థాయిలో విచారణ జరిగినా, పెద్దగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు కారణమైంది. అయితే ఇప్పుడు విపక్షం నుంచి వచ్చిన మాటలే ప్రభుత్వానికి ఆయుధంగా మారాయి.
రాష్ట్రంలో మొత్తం మూడు కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగాయని టీడీపీ (TDP), జనసేన (Janasena) ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు కూడా విచారణ ప్రారంభించాయి కానీ, కేసులు నమోదు చేసే దిశగా మాత్రం ప్రభుత్వం వెళ్లలేదు. లిక్కర్ స్కాం (Liquor Scam) , మైనింగ్ (Mining) స్కాం వంటి వాటిలో అరెస్టులు జరిపినా, టీడీఆర్ వ్యవహారంలో అంతవరకు వెళ్ళకపోవడంతో అనుమానాలు పెరిగాయి.
ఇదే సమయంలో మంత్రులు ఇచ్చిన ప్రకటనలు భిన్నంగా ఉండటం కూడా గందరగోళాన్ని కలిగించింది. తిరుపతి ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) ఈ స్కాంపై లోతైన విచారణ జరుగుతోందని చెబుతే, మున్సిపల్ మంత్రి నారాయణ (Narayana) మాత్రం పెద్దగా అవినీతి ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భూమన కరుణాకర రెడ్డి స్వయంగా తమ పార్టీ కాలంలోనే అవినీతి జరిగిందని చెప్పడం సంచలనంగా మారింది. ఆయన మున్సిపల్ శాఖలో ఉన్న ఒక కీలక అధికారి కారణమని చెబుతూ ఆరోపణలు చేయడంతో వైసీపీ అంతర్గత వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
భూమన వ్యాఖ్యలపై వైసీపీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి తూటాలు అందించేలా మాట్లాడడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాలను ఎందుకు ప్రస్తావించలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిణి పేరును ఉద్దేశించినా, పార్టీ లోపలే చర్చించి పరిష్కారం చేసుకోవచ్చు కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు బహిరంగంగా మాట్లాడటం వల్ల ప్రభుత్వం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటే, తాము కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు ఈ కేసులో సిట్ (SIT) దర్యాప్తు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి, గుంటూరు (Guntur), కాకినాడ (Kakinada), తణుకు (Tanuku) నగరాల్లో జరిగినట్లు చెబుతున్న ఈ స్కాంపై కేసులు నమోదు చేసే దిశగా కదలికలు కనిపిస్తున్నాయి. భూమన వ్యాఖ్యలతో నిశ్శబ్దంగా ఉన్న ప్రభుత్వానికి తగిన కారణం దొరకడంతో ఇక చర్యలు తప్పవని పరిశీలకులు అంటున్నారు.