Kadapa: కడపలో తెర వెనుక రాజకీయం.. డైలమాలో కూటమి..

కడప జిల్లా (Kadapa District) రాజకీయ పరిణామాలు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ (TDP) కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, కడపలో మాత్రం వైసీపీ (YSRCP) నేతల ప్రభావం బలంగానే ఉందని పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (Madhavi Reddy) ఎదుర్కొంటున్న అవమానాలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి.
ఆగస్టు 15వ తేదీన జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాధవీ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించకపోవడం, ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసిన కడప సీఐ రామకృష్ణ యాదవ్ (Ramakrishna Yadav) ను తక్షణమే వీఆర్ (VR) కి పంపించడం పెద్ద చర్చకు దారితీసింది. పోలీసు ఉన్నతాధికారుల ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాధవీ రెడ్డి ఫిర్యాదులో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా (Amjad Basha) తో పాటు ఆయన సోదరుడు అహ్మద్ బాషా (Ahmed Basha) పేర్లు కూడా ఉండగా, వారిని నిందితులుగా చేర్చడమే సీఐకు సమస్యగా మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పై అధికారులు కేవలం అంజాద్ బాషా పీఏ ఖాజా (Khaja) పేరును మాత్రమే చేర్చాలని సూచించారని, కానీ సీఐ ఆ సూచనలను పట్టించుకోకుండా ఇద్దరు నాయకుల పేర్లను కేసులో నమోదు చేశారని వార్తలు వెలువడుతున్నాయి. దీన్నే కారణంగా సీఐపై చర్యలు తీసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, జిల్లా ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ (Sachiketh Vishwanath) మాత్రం సీఐపై తీసుకున్న నిర్ణయం పూర్తిగా క్రమశిక్షణాత్మకమేనని స్పష్టం చేశారు. ఆయన ప్రకారం, విభాగ నిబంధనలు పాటించకపోవడం వల్లే యాదవ్‌ను వీఆర్‌కు పంపించారని చెప్పారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీనిని రాజకీయ చర్యగానే చూస్తున్నాయి.
గత పదహారు నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, మాధవీ రెడ్డి ప్రాంతంలో తన మాట బలపడకపోవడం నిరాశ కలిగిస్తోందని పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. కడప మునిసిపల్ కార్పొరేషన్ (Kadapa Municipal Corporation) సమావేశాల్లో ఆమెకు కుర్చీ ఇవ్వకపోవడం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తగిన గౌరవం లేకపోవడం, ఇప్పుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐని విధుల నుంచి తప్పించడం కడప లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఈ పరిణామాలపై ఇప్పటివరకు మాధవీ రెడ్డి ఎటువంటి పబ్లిక్ రియాక్షన్ ఇవ్వకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ఆమె ఈ సారి ఎలా స్పందిస్తారన్నది అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. కడప జిల్లాలో జరుగుతున్న ఈ రాజకీయ సంఘటనలు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కానున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.