Chandrababu: శీతాకాల సమావేశాలకు ఎంపీ లకు బాబు టాస్క్: రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం
దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (TDP) స్థానం మరింత బలపడుతోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం వల్ల, పార్టీకి చెందిన 16 మంది ఎంపీల పాత్ర మరింత ప్రధానంగా మారింది. అధికారంలో భాగమై ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మిగిలిన సమస్యలను నిరంతరం కేంద్ర దృష్టికి తీసుకెళ్లే బాధ్యత టీడీపీపై పడింది. ఈ నేపధ్యంలో ఎంపీలు మరింత చురుకాగా పనిచేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) స్పష్టం చేశారు.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందుగా జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ముఖ్యంగా నీటి వనరులకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని ఆయన చెప్పారు. రైతులకు సంబంధించిన ధరల సమస్యలు, సాగునీటి లేమి, ప్రాజెక్టుల అనుమతులు వంటి అంశాలు ఏపీలో ప్రజల జీవనోపాధికి నేరుగా సంబంధించేవని ఆయన గుర్తు చేశారు.
టీడీపీలో ఎక్కువ మంది యువ ఎంపీలు ఉన్నారని, వారు తాజాగా ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కృష్ణా–గోదావరి జలాల్లో (Krishna -Godavari waters) రాష్ట్ర వాటా, గోదావరి ట్రైబ్యునల్ (Godavari Tribunal) , సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు పొందడం వంటి అంశాల్లో కేంద్రాన్ని ఒప్పించాలి అని చంద్రబాబు సూచించారు. అలాగే వంశధార (Vamsadhara) , నల్లమల సాగర్, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తును మార్చగలవని, వీటికి అవసరమైన అనుమతులు, సాయం వెంటనే తీసుకురావాలని ఎంపీలను కోరారు.
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) రాష్ట్రానికి జీవనాడి అని ఆయన మరోసారి గుర్తుచేశారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం సహకరించాలని పార్లమెంట్లో గట్టిగా చెప్పాలని సూచించారు. పత్తి, అరటి, మొక్కజొన్న ధరల పతనం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని, ఈ సమస్యను కేంద్రానికి స్పష్టంగా వివరించి వారికి ఉపశమనం కల్పించాలని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలపై కేంద్ర మద్దతు పొందాలని ఆయన సూచించారు. విశాఖ–విజయవాడ మెట్రో, భోగాపురం ఎయిర్పోర్ట్ (Bhogapuram Airport), అమరావతి– తిరుపతి –విశాఖ ఎకనామిక్ రీజియన్స్, విశాఖ రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone), వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) వంటి కీలక అంశాలు కూడా పార్లమెంట్ అజెండాలో ఉండాలని చెప్పారు. మొత్తానికి, ఈ శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో పోరాడాలని చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.






