Ys jagan: బలమే జగన్ కు బలహీనత అవుతోందా..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్(YS Jagan), ప్రసంగాలకు అప్పట్లో భారీగా అభిమానులు ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయన ఏది మాట్లాడినా సరే మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి జరుగుతూ ఉంటుంది. అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడే జగన్ ఈమధ్య మాత్రం తడబడుతున్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో జగన్ పై ఒక అపవాదం ఉంటుంది. విలేకరులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పరు అనేది ప్రధాన ఆరోపణ. అధికారంలో ఉన్న సమయంలో కూడా విలేకరులతో.. ఆయన ఎప్పుడూ నేరుగా మీడియాతో మాట్లాడిన పరిస్థితి లేదు.
ఇక అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో తడబడటం.. వైసిపి(YSRCP) కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రసంగాలకు జాతీయ మీడియా సైతం ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జగన్ ఇప్పుడు పదేపదే తప్పులు మాట్లాడుతున్నారు. ఇటీవల తెనాలి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలపై వైసీపీ సోషల్ మీడియా పెదవి విరుస్తోంది. ఇక తాజాగా పొదిలి పర్యటనలో కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
పొగకు మద్దతు ధర విషయంలో ఆయన మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. ఒకప్పుడు దూకుడుగా మాట్లాడిన జగన్.. ఇప్పుడు ఇలా తడబడటాన్ని వైసీపీ కార్యకర్తలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన, బీజేపీ పార్టీలకు బలంగా మారుతుంది. ఒకప్పుడు నారా లోకేష్ తో పాటుగా పలువురు టిడిపి నాయకుల ప్రసంగాల విషయంలో సెటైర్లు వేసిన వైసిపి కార్యకర్తలు.. ఇప్పుడు జగన్ మాట్లాడుతున్న మాటలు విషయంలో ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతున్నారు. జగన్ మీడియా సమావేశం పెడితే వాటిని కవర్ చేసుకోవడానికి వారికి ఎక్కువ సమయం పడుతుంది. గతంలో మాదిరిగా వైరల్ చేసుకునే అంశాలు కూడా పెద్దగా దొరకకపోవడంతో వైసిపి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాట్లాడే ముందు కాస్త వర్కౌట్ చేసి మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.