Jagan – KTR : ఒకే బాటలో జగన్, కేటీఆర్..!?

ఆంధ్రప్రదేశ్ విడిపోయినా తెలుగు రాష్ట్రాల రాజకీయం మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్కంఠ మరో రాష్ట్రం వాళ్లకు కూడా ఉంటుంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య పోటీ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. రాష్ట్రాల మధ్య పోటీ ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల నేతల మధ్య కూడా సారూప్యత కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న విధానం ఒకేలా ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇద్దరూ కలిసి ఉమ్మడిగానే ఈ స్ట్రాటజీ అవలంబిస్తన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్టులపై కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్లందరినీ లోపలేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై వైసీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. వైసీపీ నేతలపైన కూడా టీడీపీ వాళ్లెంతోమంది అసభ్యకరంగా పోస్టులు పెట్టారని.. మరి వాళ్లనెందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. అంతేకాదు.. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నందుకు ముందు ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషాయన్ని తనతో పాటు వైసీపీ వాళ్లంతా ఎక్స్ లో పోస్ట్ చేస్తారని.. దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయాలని జగన్ సవాల్ విసిరారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా హబ్ భూసేకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. అధికారులపై దాడుల వెనుక బీఆర్ఎస్ హస్తముందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కూడా కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ చేశారు. అరెస్టు చేస్తే జైలుకెళ్లి యోగా చేసి ట్రిమ్ గా తయారై బయటికొచ్చి పాదయాత్ర చేస్తానన్నారు.
అంటే… అటు జగన్, ఇటు కేటీఆర్ ఇద్దరూ అరెస్ట్ మీ.. అంటూ సవాళ్లు విసురుతున్నారు. తమను అరెస్టు చేస్తే సింపతీ వస్తుందని భావిస్తున్నారో ఏమో.. ఇద్దరూ ఒకేసారి ఒకే రాగం ఆలపిస్తుండడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కలిగిస్తోంది. మిత్రపక్షాలైన బీఆర్ఎస్, వైసీపీ నేతలిద్దరూ ఒకేసారి ఇలా మాట్లాడడం యాదృఛ్చికమే అయినా.. ఆ రెండు పార్టీల మధ్య స్నేహం బలంగా ఉండడంతో ఉమ్మడిగా ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు ఇలా వ్యవహరిస్తూ ఉండొచ్చనే టాక్ కూడా నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిన విషయమే. వీళ్లిద్దరినీ ఎదుర్కొనేందుకు అటు జగన్, ఇటు కేటీఆర్ ఉమ్మడిగా స్కెచ్ వేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.