AP Govt: చంద్రబాబు–పవన్ నేతృత్వంపై ప్రజల్లో విశ్వాసం..సర్వేల్లో అనుకూల స్పందన..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజల అభిప్రాయాలను పలు సర్వేలు వెల్లడించాయి. రాష్ట్రంలో సుమారు 70 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వేల్లో పేర్కొనడం విశేషం. దీంతో, ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉన్నదన్న విషయం స్పష్టమవుతుంది. ఇంకా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Jagan ) మాత్రం ఇటీవలి కాలంలో జరుగుతున్న మీడియా సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రజలు తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారని పదే పదే చెబుతూ వస్తున్నారు. కానీ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే కొన్ని తాజా అధ్యయనాల ప్రకారం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల ప్రజలలో మంచి స్పందన కనిపిస్తోంది.
‘సూపర్ సిక్స్’ (Super six) హామీలు ఇంకా పూర్తిగా అమలులోకి రాకపోయినప్పటికీ, వాటి పట్ల ప్రజల్లో మంచి అంచనాలున్నాయన్నది నిజం. మరోపక్క ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు, రోడ్డు అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకి గమనించబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే, కొత్త ప్రభుత్వం పట్ల ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లపై ప్రజల నమ్మకం గట్టిగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదే సమయంలో, వైసీపీ నాయకత్వం ఈ నమ్మకాన్ని గుర్తించలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఒక్క ఏడాదిలోనే వ్యతిరేకతను ఎదుర్కొనడం సాధ్యపడదు. అందులోనూ ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న రాష్ట్రం ఒకటైతే, ప్రజలు మరింత సహనంతో చూడాల్సి వస్తుంది. ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తించి అంగీకరించడమే కాకుండా, వచ్చే సంవత్సరంలో తమకు మేలు జరుగుతుందన్న ఆశలు పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. దీంతో ఇప్పటివరకు ప్రజలు తమ పై ఉంచిన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది అన్న విషయం స్పష్టమవుతుంది.