B.C. Janardhan Reddy: గుంటల రోడ్ల నుంచి మన్నికైన రహదారుల దిశగా ఏపీ ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి ప్రస్తుతం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలతో నిండిపోవడం, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం కామన్ విషయమే. అయితే గత కొన్నేళ్లుగా సరైన మరమ్మతులు, పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిపోయిందని రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) తెలిపారు. వైసీపీ పాలనలో రోడ్ల పట్ల కనీస శ్రద్ధ కూడా తీసుకోకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా భారీ భారం మోయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
మీడియాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర రోడ్ల అసలు పరిస్థితిని ఆయన వివరించారు. ఏపీలో మొత్తం 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు పాడైపోయాయని, వాటిలో సగానికి పైగా అంటే దాదాపు 15 వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా పనికిరాని స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు. ఈ రోడ్లను పునర్నిర్మించడానికి ప్రభుత్వం అదనంగా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన చెప్పారు. గత అయిదేళ్లలో వైసీపీ (YCP) నేతల నిర్లక్ష్యం వల్ల రోడ్ల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నది ఈ పరిస్థితి చెబుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టిందని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మొదటి దశలోనే 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్ల గుంతలను పూడ్చడంలో ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల రోడ్లను గుంతల నుంచి విముక్తి కలిగించేలా పునరుద్ధరించామని వివరించారు. అలాగే రోడ్ల నాణ్యత పెంచడానికి కొత్త విధానాలు తీసుకువచ్చినట్లు చెప్పారు.
డెన్మార్క్ (Denmark) పద్ధతిలో ఉపయోగించే డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీ (Danish Fiber Technology)ను ఏపీలో రోడ్ల బలపర్చడానికి వినియోగిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీని వల్ల రోడ్లు మరింత కాలం మన్నేలా ఉండే అవకాశముందని చెప్పారు. అదనంగా రాష్ట్రంలో సుమారు ఐదు వేల రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యమైన ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌వేలు, అలాగే అమరావతి రింగ్ రోడ్ (Amaravati Ring Road) వంటి పెద్ద ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధి కోసం స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రోడ్లు రాష్ట్ర ప్రగతికి పునాది అని, వాటి ద్వారా అనేక రంగాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన అన్నారు. రానున్న రోజులలో పూర్తి నాణ్యతతో, దీర్ఘకాలం నిలిచే రహదారులను నిర్మించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.






